ప్రభుత్వ బడుల బలోపేతానికే ‘అమ్మ’ ఆదర్శ కమిటీలు

– జూన్ మొదటి వారంలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
– ఎంపీడీవో వేణుమాధవ్
నవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు, బడుల అభివృద్ధిలో ‘అమ్మ’ లను భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల నోడల్ హెచ్ఎం బుధారపు శ్రీనివాస్ తో పాటుగా, మండలానికి చెందిన గ్రామ సమాఖ్య అధ్యక్షులు, పాఠశాలల హెచ్‌ఎంలు, వివిధ శాఖల అధికారులతో కలిసి ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల కమిటీల విధివిధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కమిటీలకు చైర్మన్‌ గా గ్రామ సంఘం అధ్యక్షురాలు, కన్వీనర్ గా పాఠశాల హెచ్‌ఎంలు వ్యవహరిస్తారని, ప్రతి తరగతి నుంచి ముగ్గురు తల్లులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈ కమిటీలు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కు తీర్మానాలు చేసి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పరిశీలించడం తో పాటు మధ్యాహ్న భోజనం నిర్వహణ, పాఠశాలకు ప్రభుత్వ పరంగా మంజూరైన నిధులు నిర్వహణ కూడా చూస్తారన్నారు. ఇక నుంచి పాఠశాలలో జరిగే అభివృద్ది పనులు అన్నీ ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారానే జరుగుతాయని చెప్పారు. జూన్ మొదటి వారంలోగా ఆయా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. కాగా మండలంలో గత నెల మార్చి 14, 15 తేదీల్లో ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల కమిటీల ఎంపిక పూర్తయిందని, పాఠశాలలకు కమిటీ పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. మండలంలోని 20 పాఠశాలలు ‘అమ్మ’ ఆదర్శ పాఠశాల కమిటీల కింద ఎంపికైనట్లు తెలిపారు. వీటిలో 2 జెడ్పీ ఉన్నత పాఠశాలలు చిట్యాల, బొమ్మకల్, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు పోచంపల్లి, ఉప్పెరగూడెం, కొరిపల్లి, 15 ప్రాథమిక పాఠశాలలు పడమటి తండా, జయరాం తండా, ఉప్పరగూడెం, రామచంద్రు తండా, పెద్దవంగర ఎక్స్ రోడ్డు, సోమ్ల తండా, కొరిపల్లి తండా, శంకర్ తండా, భద్రు తండా, పోచారం, చిన్నవంగర, ఎల్బీ తండా, కిష్టు తండా, బావోజి తండా, రెడ్డికుంట తండా పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4 ప్రాథమిక పాఠశాలు పడమటి తండా, జయరాం తండా, సోమ్ల తండా, భద్రు తండా పాఠశాలలు విద్యార్థులు లేక గతంలోనే మూత పడ్డాయని అధికారులు వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీఓ సత్యనారాయణ, ఏపీఎం రమణాచారి, ఏఈ అశోక్, ఆయా గ్రామాల గ్రామ సమాఖ్య అధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love