హస్తినలో సీఎం బిజీబిజీ

CM BGBG in Hastina– కేంద్రఆరోగ్యశాఖమంత్రి నడ్డాతో రేవంత్‌ భేటీ
– ఎన్‌హెచ్‌ఎం కింద రూ.324 కోట్ల విడుదలకు వినతి
– 4 గంటల పాటు పార్లమెంట్‌లోనే ముఖ్యమంత్రి
– అగ్రనేతలతో కలిసి ప్రమాణస్వీకారాన్ని వీక్షించిన సీఎం
– నామినేటెడ్‌ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలపై అగ్రనేతలతో చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ పర్యటనలో ఉన్నరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీబిజీగా గడిపారు. తొలిరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను కలిశారు. రెండో రోజు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డితో కలిసి పార్లమెంట్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన ఛాంబర్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద మూడు, నాలుగు త్రైమాసికాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రూ.323.73 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. ఈ నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్‌హెచ్‌ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్‌ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు. కేంద్రం నుంచి ఈ నిధులు సకాలంలో అందకపోయినా, అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వమే తగు చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా 2023 అక్టోబరు నుంచి రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన వాటా మొత్తాన్ని తామే విడుదల చేస్తున్నామని సీఎం వివరించారు. ఇప్పటికైనా ఎన్‌ హెచ్‌ ఎం కింద తెలంగాణకు రావాల్సిన పెండింగ్‌ నిధులు సత్వరమే రిలీజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.
4 గంటలు పార్లమెంట్‌ లోనే
రెండో రోజు పర్యటనలో దాదాపు నాలుగు గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌లోనే గడిపారు. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నడ్డాతో భేటీలో భాగంగా ఆయన పార్లమెంట్‌కు చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌, ఇతర పార్టీ ఎంపీలతో కాసేపు ముచ్చటించారు. మరోసారి ఎంపీలుగా ఎన్నికైన సుప్రియా సూలే, ఇతర సీనియర్లకు అభినందనలు తెలిపారు. తరువాత లంచ్‌ కోసం తుగ్లక్‌ రోడ్‌ వెళ్లారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు మధ్యాహ్నం 1:40 నిమిషాలకు మళ్లీ పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా, రాహుల్‌ ప్రమాణ స్వీకారం కోసం సోనియా వస్తున్నారన్న సమాచారంతో ఛాంబర్‌ దగ్గర ఆమె కోసం వెయిట్‌ చేశారు. తరువాత సోనియా, ప్రియాంక గాంధీ, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ వివేక్‌లతో కలిసి రాష్ట్ర ఎంపీలు, రాహుల్‌ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వివేక్‌ వెంకట స్వామి, ఇతర నేతలతో కలిసి పార్లమెంట్‌ ద్వారం వద్ద ఫొటోలు దిగారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండీ…
ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలుపొందినా, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా లోక్‌సభలో పోరాడాలని ఎంపీలకు సూచించారు. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు అని గుర్తించి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పార్లమెంట్‌ను వేదికగా చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంపీలకు సూచించారు.
సోనియాతో మాటామంతి
పార్లమెంట్‌లో దాదాపు 50 నిమిషాల పైగా అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారు. పార్లమెంట్‌కు చేరుకున్న సోనియా గాంధీకి సీఎం రేవంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సోనియా, ప్రియాంక గాంధీలతో కలిసి తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి వీక్షించేందుకు వీవీఐపీ గ్యాలరీలకు వెళ్లారు. అప్పటికి తెలంగాణ ఎంపీల ప్రమాణం స్వీకారం ప్రారంభమైంది. అనంతరం యూపీలోని రారుబరేలీ నుంచి ఎన్నికైన రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. అయితే… తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార సమయంలో సోనియా, రేవంత్‌ రెడ్డి మధ్య రాష్ట్రానికి చెందిన అంశాలు చర్చలకు వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఇటీవల మంత్రివర్గం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని రేవంత్‌, సోనియాకు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీల చేరికలు, మంత్రి వర్గ విస్తరణ పై కూడా చర్చించినట్లు సమాచారం.
పార్టీ ఎంపీలకు దీపా మున్షీ విందు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా మున్షీ విందు ఇచ్చారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం తుగ్లక్‌ రోడ్‌లో ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎంతో పాటు, తెలంగాణ నుంచి గెలుపొందిన 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు, ఢిల్లీలో అందుబాటులో ఉన్న రాష్ట్రానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Spread the love