నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని.. అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు అందించనున్నారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్షించారు. సమావేశంలో సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.