మిమ్మల్ని బయటకు పంపం.. అదే మీకు శిక్ష : సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్‌: సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని ఇదే సభలో కేసీఆర్‌(KCR) అంగీకరించారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తుచేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా (TS Assembly Sessions) సీఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌ గడీలు బద్దలుకొట్టి, ఇనుప కంచెను తొలగించిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు భారీగా తరలివస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
‘‘ఓటమి తర్వాతైనా బీఆర్ఎస్ లో మార్పు వస్తుందని ఆశించా. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా. ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. ‘మా పార్టీ మా ఇష్టం’ అనేది ఎక్కువ కాలం చెల్లదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం.. కడుగుతామని శ్రీశ్రీ చెప్పారు. నిరంకుశత్వం ఎక్కువ కాలం ఉండదు. ప్రజలు నిటారుగా నిలబడి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు’’ ప్రజాభవన్‌కు ప్రజలు స్వేచ్ఛగా రావొచ్చు.. ‘‘ప్రగతి భవన్‌ గడీలను బద్దలుకొట్టి ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు రావడం బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి ప్రగతి భవన్‌లోకి ప్రవేశం లేదని హోంగార్డు వెనక్కి పంపారు.
ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్తే.. అనుమతి లేదని పోలీసులు వెనక్కి పంపించారు. సీఎంను కలిసేందుకు వెళ్లిన ప్రజాగాయకుడు గద్దర్‌ను కూడా అదే విధంగా అవమానించారు. గంటల కొద్దీ ఆయన్ను ప్రగతిభవన్‌ గేటు వద్ద నిలబెట్టారు. ఈ ఘటనలన్నీ తెలంగాణ ప్రజలు గమనించారు. భారాస హయాంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులు, గద్దరన్నకు అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి.. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాం. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఎవరైనా తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారు.. ‘‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌ నిరసన తెలిపినందుకు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చరిత్రను ప్రజలు మర్చిపోలేదు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆరు గ్యారంటీలకు ఆమోదం తెలిపాం. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే కార్యాచరణ రూపొందిస్తున్నాం. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్‌కు పిలిచి గౌరవించారా? ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా? పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు.
తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న డీఎస్పీ నళినికి ఎందుకు న్యాయం చేయలేదు? కేసీఆర్‌.. తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమ పార్టీ అని పదేపదే చెప్పే బీఆర్ఎస్.. ధర్నాచౌక్‌ ఎత్తేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం ధర్నాచౌక్‌ను పునరుద్ధరించి తెలంగాణ ప్రజలకు హక్కులు కల్పిస్తే అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు. కావాలనుకుంటే కేటీఆర్‌, బీఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్‌లో ధర్నా చేసుకోవచ్చు’’.
  పదేండ్లలో 8వేల మంది రైతుల ఆత్మహత్యలు..
‘‘గత పదేండ్లలో తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌టీ నివేదిక చెబుతుంది. రైతు ప్రభుత్వం ఇదేనా ? రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. రైతు బతికి ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతు చనిపోయిన తర్వాత రూ.5 లక్షలు ఇచ్చింది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఇదే వారికి శిక్ష
‘‘వరి వేస్తే.. ఉరే అని చెప్పిన కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్‌ తన వడ్లను క్వింటాకు రూ.4,250కి అమ్ముకున్నారు. దీనిపై విచారణకు సిద్ధమా? తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌ అనేది పచ్చి అబద్ధం. కోటి ఎకరాలకు కాల్వల ద్వారా నీరు ఇస్తే పంపుసెట్ల సంఖ్య ఇంకా ఎందుకు పెరిగింది? 2014లో పంపుసెట్ల సంఖ్య 19 లక్షలు ఉంటే ఇవాళ 29 లక్షలకు చేరింది. తెలంగాణ వచ్చాక కూడా కృష్ణా జలాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాం? ప్రత్యేక తెలంగాణలో కూడా పాలమూరు, చేవెళ్ల ప్రాంతంపై వివక్ష కొనసాగింది. ప్రాణహిత – చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. వాళ్లు ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన నేరెళ్ల ప్రజలను కేసులు పెట్టి హింసించారు. దళితులను లాకప్‌లలో పెట్టి.. కరెంట్‌ షాక్‌ ఇచ్చి హింసించారు. భారాస సభ్యులను ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించం. వారిని ఇక్కడే కూర్చోబెట్టి కఠోర నిజాలు వినిపిస్తాం. వారికి ఇదే శిక్ష’’ అని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
క్షమాపణ చెప్పాల్సిందే..
‘‘పదో తరగతి పరీక్షలు సరిగా నిర్వహించని వారు.. ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేక.. 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారు.. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నవారు వారు సిగ్గుతో తలదించుకొని.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. మేనేజ్‌మెంట్‌ కోటాలో పదవి పొందాలనుకుంటే కేటీఆర్‌కు నిరాశ ఎదురైంది. పదవి దక్కలేదనే నిరాశతోనే కేటీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

డ్రగ్స్‌ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించం..
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారింది. డ్రగ్స్‌ ఘటనపై సిట్‌ వేయాలని నేనే పోరాటం చేశాను. డ్రగ్స్‌ కోరల్లో చిక్కుకున్న పంజాబ్‌ మాదిరే మన రాష్ట్రాన్ని తయారు చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన న్యాబ్‌ కాగితాలకే పరిమితమైంది. డ్రగ్స్‌ నివారణకు 319 మంది సిబ్బంది కావాలంటే ఇవ్వలేదు. న్యాబ్‌ రూ.29 కోట్ల నిధులు కోరితే కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం డ్రగ్స్‌ను అరికట్టేందుకు పటిష్ఠ ప్రణాళికతో వెళ్తోంది. డ్రగ్స్‌ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.. కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్‌, గంజాయి వస్తే ఊరుకోం. ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే విధంగా సంక్షేమ, అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్తాం.. ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నా. మేం పాలకులం కాదు.. సేవకులం. నాలుగున్నర కోట్ల ప్రజలకు సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు.

Spread the love