15న 9 మెడికల్ కాలేజీల‌ను ప్రారంభించ‌నున్న సీఎం

నవతెలంగాణ – హైద‌రాబాద్: ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్ రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది ఒకే వేదిక నుంచి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించినట్లుగా, ఈ ఈనెల 15న మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అందుబాటులో ఉండి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. శుక్రవారం మరోసారి సమావేశమై ఏర్పాట్లు పర్యవేక్షించాలని కాళోజీ వర్సిటీ వీసీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ని మంత్రి ఆదేశించారు. అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సమావేశం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో మూడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఉన్నాయన్నారు. తాజాగా ప్రారంభించే 9 మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని చెప్పారు. కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. 2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, ప్రస్తుతం 3915 సీట్లు ఉన్నాయన్నారు.

Spread the love