ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం తీపి కబురు

CM's sweet talk to employees and pensioners– ఎంప్లాయి హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
– ఉత్తర్వులు జారీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ 
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం కే.చంద్రశేఖర్‌రావు తీపికబురు అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత, మరింత నాణ్యమైన చికిత్స అందించేందుకు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ను ప్రత్యేకంగా ఎంప్లాయి హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) పేరుతో ఏర్పాటు చేసి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్సీ కమిషన్‌ ప్రభుత్వానికి సూచించింది. పథకం అమలు కోసం ప్రత్యేక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా జమ చేయాలని పేర్కొంది.ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ట్రస్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) చైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు.
మంత్రి హరీశ్‌ రావు హర్షం
నూతన ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ, తమది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం కేసీఆర్‌ మరోసారి నిరూపించారని ఆయన స్పష్టం చేశారు.

 

Spread the love