బీహార్‌లో కుప్పకూలిన వంతెన..

నవతెలంగాణ – పట్నా: ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న బీహార్‌లో మరో వంతెన  కుప్పకూలింది. సివాన్‌ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడువక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతీహరిలో రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్‌ కోసం ఏర్పాటుచేసిన సెంట్రింగ్‌ పైపు బలహీనంగా ఉండటంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే రాష్ట్రంలో వంతెనలు కుప్పకూలిపోవడం ఇది మూడోసారి. అరారియాలోని బక్రా నదిపై రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఈ నెల 18న కూలిపోయిన విషయం తెలిసిందే. ఇక జూన్‌ 22న (శనివారం) సివాన్‌లోని గండక్‌ కాలువపై వంతెన కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్‌ బ్లాక్స్‌లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్‌పై కట్టిన ఈ బ్రిడ్జ్‌..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్‌లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్‌ ముకుల్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

Spread the love