ధాన్యం కొనుగోళ్లలో ‘యూ’ ట్యాక్స్‌ వసూలు

ధాన్యం కొనుగోళ్లలో 'యూ' ట్యాక్స్‌ వసూలు– రూ.930 కోట్ల కుంభకోణం..
– చేతులు మారిన రూ.500 కోట్లు
– రూ.100 కోట్లను కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపిన మంత్రి ఉత్తమ్‌
– దీనిపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలి : బీజేపీ ఎల్పీ నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ‘యూ’ ట్యాక్స్‌ పేరుతో రూ.930 కోట్ల కుంభకోణం జరిగిందనీ, ఇప్పటికే రూ.500 కోట్లు చేతులు మారగా అందులో రూ.100 కోట్లను కాంగ్రెస్‌ అధిష్టానానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంపారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాఖల వారీగా ఎవరికి వారుగా టోల్‌ గేట్లను ఏర్పాటు చేసుకున్నారనీ, సివిల్‌ సప్లరులో ధాన్యం కొనుగోలు కుంభకోణం ఒక టోల్‌ గేట్‌ మాత్రమేనని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోళ్లలో తాలు, తేమ పేరుతో 40 కేజీల బస్తాకు 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ క్వింటాలుకు 10-12 శాతం ధాన్యాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సంవత్సరానికి కోటి 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్లు తెలుస్తోందనీ, అందులో 13 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి అధికంగా క్వాంటా చేస్తున్నారని విమర్శించారు. రశీదులు లేకుండా రైతుల నుంచి అధికంగా కొల్లగొడుతున్న రూ. 1600 కోట్ల విలువైన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తోందంటూ నిలదీశారు. అందులో అధికారులు, సంబంధిత మంత్రి వాటా ఎంత అని ప్రశ్నించారు.
తన సహచర మంత్రులు ఢిల్లీకి డబ్బులు పంపుతుండంతో తాను ఎక్కడ వెనుకబడిపోతానో అన్న భయంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీ అధిష్టానానికి పంపారని ఆరోపించారు. సీఎంఆర్‌ కింద రూ.25 వేల కోట్ల ధాన్యం రైస్‌మిల్లర్ల దగ్గర ఉందన్నారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్‌ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా? డిఫాల్టర్ల వివరాలున్నాయా? లేవా? అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి మాత్రమే బోనస్‌ ఇస్తామని చెప్పటం దారుణమన్నారు. సన్నవడ్లు నల్లగొండ జిల్లాలోనే పండుతాయనీ, మంత్రి ఉత్తమ్‌ తన జిల్లా రైతులకు న్యాయం జరిగితే చాలని భావిస్తే సరిపోదని అన్నారు.

Spread the love