నేరెళ్ల పీహెచ్ సీ ని తనిఖీ చేసిన కలెక్టర్

– వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలి…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్ సీ ని కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా దవాఖానకు వస్తున్న ఓపీ వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళా కింద ఎంత మందికి పరీక్షలు చేశారు? వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని డాక్టర్ ను అడిగారు. అనంతరం దవాఖానకు నిత్యం ఎంత మంది రోగులు వస్తున్నారు? వారికి ఏ ఏ పరీక్షలు చేస్తున్నారు, వడ దెబ్బ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. ఓఆర్ఎస్ పాకెట్స్ నిల్వల వివరాలు సే కరించారు. అనంతరం క్యాన్సర్, బీపీ, షుగర్ పేషంట్స్ ఎవరైనా ఉన్నారా.. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. గత నెలలో ఎన్ని డెలివరీలు అయ్యాయని తెలుసుకోగా, 23 అయ్యాయని, 14 ప్రభుత్వ ఆసుపత్రిలో, 9 ప్రైవేటు ఆసుపత్రిలో అయినట్లు వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమాదేవి, డీడీఎం కార్తీక్, మెడికల్ ఆఫీసర్ రేఖ, ఎంఎల్ హెచ్ పీ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

Spread the love