గడువులోగా యూనిఫాం క్లాత్ అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

– టెక్స్ టైల్ పార్కులోని వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తి పరిశీలన
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నిర్దేశిత గడువులోగా స్కూల్ యూనిఫాం క్లాత్ అందించాలని టెక్స్ టైల్ పార్క్ ఉత్పత్తిదారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. తంగళ్లపల్లి మండలంలోని టెక్స్ టైల్ పార్కులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కుట్టించే స్కూల్ యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేసే వస్త్ర పరిశ్రమలను కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా  దారం నుంచి మొదలుకొని బట్ట ఉత్పత్తి వరకూ వివిధ దశలు క్షుణ్ణంగా పరిశీలించారు. బట్ట తయారీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నాణ్యతను తెలుసుకున్నారు. కార్మికులతో మాట్లాడి తయారీ పై మరిన్ని వివరాలు తెలుసుకొని, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ స్కూల్ యూనిఫాం క్లాత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. గడువులోగా క్లాత్ ను కుట్టించేందుకు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులకు మొత్తం 1,15,816 యూనిఫాంలు కుట్టించనున్నట్లు ఆయన తెలిపారు. మహిళా సంఘాల బాధ్యులు 768 మందికి ఉపాధి లభించనుంది. ఆయన వెంట టెక్స్ టైల్ ఆర్డీడీ అశోక్ రావు, ఏడీ సాగర్, డీఆర్డీఓ శేషాద్రి, డీఈఓ రమేష్ కుమార్ ఉన్నారు.

Spread the love