నిబద్ధత గల ఉత్తమ కమ్యూనిస్టు

– కామ్రేడ్‌ రౌతు జగన్నాధం
– నేడు వర్ధంతి
నవతెలంగాణ-చింతకాని
బక్క పల్చని మనిషి. అయితేనే… ఉక్కు క్రమశిక్షణతో బతికాడు. పీడిత వర్గంలో పుట్టి పెరిగాడు. అయితేనే…. భూస్వామ్య గడీల రాజకీయాలకు వ్యతిరేకంగా ఎర్రజెండాను ఎత్తిపట్టాడు. దళిత వెలివాడలకు గుండె ధైర్యం అయ్యాడు. కూలి పోరాటాలకు అండగా నిలబడ్డాడు. అతడే నాగులవంచ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు కామ్రేడ్‌ రౌతు జగన్నాథం. స్వాతంత్ర పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ రెండు పోరాటాల నడుమ కామ్రేడ్‌ జగన్నాథం ఎదుగుతూ వచ్చాడు. వ్యవసాయ కార్మికులు, రైతుల బాధలను చూసి చెల్లించాడు. ప్రజల కష్టాలకు, కన్నీళ్ళకు, సామాజిక వెనుకబాటుకు గ్రామంలోని భూస్వామ్య పెత్తందారులే కారణమని నిర్ధారించుకున్నాడు. వారికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మార్క్సిజమే సరియైన మార్గమని, కమ్యూనిస్టు పార్టీనే సరియైన పార్టీ అని నమ్మాడు. నాగులవంచ, సీతంపేట ప్రాంతం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన కామ్రేడ్‌ బెల్లంకొండ కేశవులు నాయకత్వంలో కామ్రేడ్‌ జగన్నాథం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నాటి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని భూస్వాములకు వ్యతిరేకంగా కష్టజీవులను కూడ గడుతూ బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడు.కూలిపోరాటాలకు, భూమి పోరాటాలకు నాయకత్వం వహించాడు. పట్టు విడుపులతో ఒక అడుగు వెనక్కి , పట్టుదలతో రెండు అడుగులు ముందుకు అనే ఎత్తుగడతో నాగులవంచ గ్రామంలో కామ్రేడ్‌ జగన్నాథం బలమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మించాడు.
1964, 69, 72 సంవత్సరాలలో కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికల సమయంలో కామ్రేడ్‌ జగన్నాధం సీపీఐ(ఎం)తో కలిసి నడిచారు. ముఖ్యంగా 1972లో రజబ్‌ అలి సిపిఎం పార్టీ నుంచి సిపిఐలోకి వెళ్ళినప్పుడు కేవలం 5గురు కామ్రేడ్స్‌ మాత్రమే సిపిఎంలో మిగిలారు. అందులో ఒకరు కామ్రేడ్‌ జగన్నాథం. ఈ సమయంలో పార్టీ బలహీనపడినా కామ్రేడ్‌ జగన్నాథం గుండె ధైర్యం కోల్పోలేదు. తిరిగి నాగులవంచ ప్రాంతంలో సిపిఎంను బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. నాటి కమ్యూనిస్టు పార్టీ దిగ్గజాలైన కామ్రేడ్‌ రావేళ్ల సత్యం, కామ్రేడ్‌ మంచికంటి రామ్‌ కిషన్‌ రావు తదితర నాయకులను పదే పదే గ్రామానికి పిలిపించారు. అసలైన కమ్యూనిస్టు పార్టీ సిపిఎం అని గ్రామ శ్రామిక ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. మాటలకే పరిమితం కాకుండా నిత్యం ప్రజల్లోకి వెళ్లి తిరిగారు. వారి సమస్యలను అధ్యయనం చేస్తూ, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రజా ఉద్యమాలను నిర్మించే పని చేశారు. సిపిఎం పట్ల ప్రజలు విశ్వాసం పొందేలా నిరంతరం కృషి చేశారు. కామ్రేడ్‌ రావెళ్ల సత్యం పేరు మీద నిర్మించి, కామ్రేడ్‌ మంచికంటి చేతుల మీదుగా ప్రారంభించబడిన గ్రామ సిపిఎం పార్టీ కార్యాలయం నిర్మాణంలో కూడా కామ్రేడ్‌ జగన్నాధం కృషి అభినందనీయం. గ్రామానికి పీడిత ప్రజల ప్రియతమ నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యను తీసుకువచ్చి బహిరంగ సభను నిర్వహించడంలో కూడా ఆయన కృషి మరువరానిది.
1985 – 90 కాలంలో సిపిఎం నాయకత్వంలో జరిగిన కూలి పోరాటాలలో కామ్రేడ్‌ జగన్నాథం చురుగ్గా పాల్గొన్నారు. 1500 మంది వ్యవసాయ కార్మికులను కూడగట్టి 4 కుండల కూలిని, 7 కుండలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సాగిన ఉద్యమానికి ప్రత్యక్ష నాయకత్వం వహించాడు. గ్రామంలోని నాటి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలోని ధనిక రైతాంగం ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూసింది. ఒకవైపు ప్రలోభాలు, మరోవైపు నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేసింది. ఈ చర్యలను కామ్రేడ్‌ జగన్నాథం నాయకత్వంలోని గ్రామ పార్టీ సమర్థవంతంగా ఎదిరించింది. పీడిత ప్రజల పక్షాన నికరంగా నిలబడింది. ఉద్యమ ఉధృతి ఫలితంగా రైతాంగంలోని కొందరు కూలి పెంచారు. దీనితో కష్టజీవులు కమ్యూనిస్టు పార్టీ వైపు నిలబడ్డారు. కామ్రేడ్‌ జగన్నాథం ఒకవైపు కూలి పోరాటాలు నడుపుతూనే మరోవైపు గ్రామంలోని యువకులను పోగేసి యువజన ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. అనేక మంది యువకులను సిపిఎం పార్టీలోకి తీసుకొచ్చి వారిని సుశిక్షితులైన కమ్యూనిస్టు కార్యకర్తలుగా నిలబడేలా కృషి చేశారు. కూలి పోరాటాలు, దళిత, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలతో సామాజిక ఉద్యమాలు, మరోవైపు యువజన ఉద్యమాలు… ఇలా ప్రజా ఉద్యమాలతో నాగులవంచ గ్రామంలో సిపిఎం పార్టీ బలపడింది. ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచే స్థాయికి పార్టీ ఎదిగింది. పార్టీ తరపున సర్పంచులు, ఎంపిటీసీలు గెలిచారు. కామ్రేడ్‌ జగన్నాధం కూడా 1987వ సంవత్సరంలో సుమారు 6 నెలల పాటు గ్రామ తాత్కాలిక సర్పంచిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల విజయాలను ఉపయోగించుకొని జగన్నాథం నాయకత్వంలోని సిపిఎం పార్టీ గ్రామ అభివృద్ధికి కృషి చేసింది. ప్రజల మన్నలను పొందింది.
కామ్రేడ్‌ రౌతు జగన్నాథం ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ప్రధమ శ్రేణిలో ఉండేవాడు. ప్రజలు విరాళంగా పార్టీకి ఇచ్చే ప్రతి పైసాని జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు.తాను మరణించే నాటికి పార్టీ నిధి 2830 రూపాయలు తన వద్ద ఉందని గ్రామ పార్టీకి సమాచారం ఇచ్చాడంటేనే ఆయన క్రమశిక్షణను మనం అర్థం చేసుకోవచ్చు. శత్రువులు, పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, భౌతిక దాడులు చేసినా కామ్రేడ్‌ జగన్నాథం చివరి వరకూ పార్టీకి కట్టుబడి ఉన్నారు. సిపిఎం పార్టీ పట్ల, విధానాల పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రదర్శించాడు. వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడంలో జగన్నాథం మనందరికీ ఆదర్శంగా నిలబడతాడు. నీతిగా, నిజాయితీగా, నిరాడంబరంగా ఒక మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలో అలా ఉంటూ బ్రతికాడు కామ్రేడ్‌ జగన్నాథం. తన సతీమణిని అలాగే కుటుంబ వారసులైన ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను కమ్యూనిస్టు భావజాలంతోనే పెంచారు. వారు కూడా సిపిఎంతో నడిచేలా ప్రోత్సహించారు. కామ్రేడ్‌ జగన్నాధం గత సంవత్సరమైన 2022 మే 29వ తేదీన అమరుడైనాడు. చివరి వరకు ఉత్తమ కమ్యూనిస్టుగా జీవనాన్ని కొనసాగిన ఆయన ఉద్యమ జీవితం మనందరికీ ఆదర్శం. ఆయన ఇచ్చిన ఎర్రజెండా స్ఫూర్తిని కొనసాగించడమే, మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

Spread the love