మద్దతు ధర కోసం.. ధాన్యం రైతుల ఆందోళన

మద్దతు ధర కోసం.. ధాన్యం రైతుల ఆందోళన– గన్నీ బ్యాగులు తగలబెట్టి నిరసన
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లా వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులకు మద్దతు ధర కరువైంది. మార్కెట్‌ యార్డులో ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని రైతులు నాలుగు రోజుల కిందట నిర్వహించిన ఆందోళనపై సీఎం సీరియస్‌గా స్పందించి, రైతుల వద్ద మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నాలుగు రోజుల సెలవుల అనంతరం సోమవారం ప్రారంభమైన మార్కెట్‌ యార్డులో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యాలయం ఎదుట గన్నీ బ్యాగులు తగలబెట్టి నిరసనకు దిగారు. అక్కడికి వచ్చిన జిల్లా మార్కెటింగ్‌ అధికారిని అడ్డుకొని రైతులు వాగ్వివాదానికి దిగారు. అధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా రైతులు ఆందోళన అలాగే కొనసాగించారు. మార్కెట్‌ యార్డుకు జిల్లా కలెక్టర్‌ రావాలని, రైతులు తెచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. చివరికి జనగామ ఆర్డీఓ దేవరాయ కొమురయ్య వచ్చి ధాన్యంకు మద్దతు ధర కల్పిస్తామని హామీనివ్వడంతో రైతులు శాంతించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేయకుంటే మళ్లీ నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. యాసంగి ధాన్యాన్ని మార్కెట్‌ యార్డులో మార్చి 6వ తేదీ నుండి వ్యాపారస్తులు కొనుగోలు ప్రారంభించారు. అప్పటినుంచి ఏప్రిల్‌ 13వరకు జనగామ మార్కెట్‌ యార్డ్‌లో 1407 మంది రైతుల వద్ద నుంచి 61930.10 క్వింటాళ్ల ధాన్యాన్ని క్వింటాకు రూ. 1500 నుంచి రూ.1800 వరకు ధర చెల్లించి వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. ఆరుగాలం కష్టపడ్డా రైతుకు క్వింటాకు ధర సరాసరి రూ.1700 కూడా దాటకపోవడం గమనార్హం. దాంతో నాలుగు రోజుల క్రితం మార్కెట్‌ యార్డులో రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేశారు.

Spread the love