హన్మకొండలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టుకు ఖండన

తక్షణమే విడుదల చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హన్మకొండ జిల్లాలో శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన సందర్భంగా ఒకరోజు ముందే ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్లో నిర్బందించడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను మేధావులు, ప్రజాస్వామికవాదులు కూడా ఖండించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని, పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, కాకతీయ వర్సిటీలో హాస్టళ్లు, మెస్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తున్న నాయకత్వాన్ని అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజంగా విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే పర్యటనల సందర్భంగా భయపడి పోలీసులతో ఎందుకు ముందస్తు అరెస్టు చేయిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమ్మాయి అని కూడా చూడకుండా పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో నిర్భంధించడం దుర్మార్గమని విమర్శించారు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్‌ సుల్తానా, ఇతర నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love