ధాన్యం కోనుగోళ్లలో జాప్యం

గోనే సంచులు దిగుమతి చేయాలని రోడ్డెక్కిన రైతులు హన్మకొండ జిల్లాలో అన్నదాతల ఆందోళన
నవతెలంగాణ – శాయంపేట

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు దిగుమతి చేసుకోకపోవడంతో క్యూ లైన్‌లో వాహనాలు నిరీక్షించాల్సి వస్తుందని, వాహన యజమానులు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనికి తోడు అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడుస్తున్నాయని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాయంపేట, పరకాల, నడికూడ మండలాల నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని మండలంలోని పరకాల-హన్మకొండ ప్రధాన రహదారిలోని మాందారిపేట శివారు
శ్రీనివాస రైస్‌ మిల్లులో దిగుమతి చేయడానికి రైతులు ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లు, టాటా ఏసీ వాహనాల్లో బస్తాలను తీసుకువచ్చారు. మండుటెండలో హమాలీలు ఉదయం, సాయంత్రం వేళలో బస్తాలు దిగుమతి చేస్తున్నా ఆలస్యం కావడంతో వాహనాలు రోడ్డు పక్కన క్యూ లైన్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు శనివారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దాంతో ఆగ్రహించిన రైతులు ధాన్యం బస్తాలను వెంటనే దిగుమతి చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఇమ్మడి వీరభద్రరావు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైస్‌ మిల్లు యాజమాన్యంతో మాట్లాడి ధాన్యం బస్తాలను వెంటనే దిగుమతి చేసుకోవాలని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం బస్తాలు దిగుమతి వెంటనే చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమింప చేశారు.

Spread the love