కలిసికట్టుగా బీజేపీకి బుద్ధి చెబుదాం

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో నితీశ్‌ భేటీ
న్యూఢిల్లీ :
ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ ఆదివారం భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు నితీశ్‌ కుమార్‌ యత్నిస్తున్నారు. ఆపరేషన్‌ జోడో మిషన్‌ లో భాగంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు నితీశ్‌ కుమార్‌ పలువురు నేతలతో సమావేశమవుతున్నారు. దీనిలో భాగంగా న్యూఢిల్లీ చేరుకున్న నితీశ్‌
ఆదివారం ఉదయంబీహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో పాటు ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్డులోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు పార్టీ నేతలు మనోజ్‌ ఝా, లలన్‌ సింగ్‌, సంజరు ఝాలు కూడా ఉన్నారు. బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే తమతో కలిసి రావాలని కేజ్రీవాల్‌ను కోరనున్నారు. ఢిల్లీలో పాలనాధికారాలకు సంబంధించి రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో కలిసి పోరాడుతామని కేజ్రీవాల్‌ ప్రకటించిన మరుసటి రోజే నితీశ్‌ కుమార్‌ భేటీ కావడం గమనార్హం. ఈ సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పాలనావ్యవహారాల విషయంలో ఆప్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పించేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో నితీశ్‌ తనకు పూర్తి మద్దతు ప్రకటించారని, తాము కలిసి పోరాడతామని చెప్పారు. ‘ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై అందరం కలిసి పోరాడతామని, బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే.. రాజ్యసభలో బిల్లు రూపంలోని ఆర్డినెన్స్‌ను ఓడించవచ్చని సూచించానని అన్నారు. ఇది ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌లా అవుతుందని, 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాదనే సందేశం దేశమంతటా వెళ్తుందని కేజ్రీవాల్‌ అన్నారు.
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని ఎలా లాక్కుంటుందని నితీశ్‌ కేంద్రాన్ని నిలదీశారు. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చిన హక్కుని ఎలా లాక్కోగలరని ప్రశ్నించారు. ఈ విషయంలో తాము ఆప్‌కు మద్దతుగా ఉన్నామని, మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, త్వరలో దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తామని నితీశ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదమని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ హెచ్చరించారు.

Spread the love