గన్నీ సంచులు ఇచ్చి ధాన్యం కొనాలి

ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో రైతుల ధర్నా
నవతెలంగాణ-శాయంపేట/తిరుమలాయపాలెం
ఐకెేపీ సెంటర్‌లోని ధాన్యంను వెంటనే కొను గోలు చేయాలని, గన్నీ సంచుల కోసం పడిగాపులు కాస్తున్న అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం, హన్మకొండ జిల్లాల్లో రైతులు ధర్నా నిర్వహించారు.
హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మైలారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం అయినప్పటికీ రైతులకు గన్నీ సంచులు ఇవ్వటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్దకు లారీల్లో గన్నీ సంచులు వచ్చాయని, గోదాముల్లో సంచులు నిల్వ చేస్తున్నారని తెలిపారు. పెద్దకోడపాక క్లస్టర్‌ వ్యవసాయ విస్తరణ అధికారి శివకుమార్‌, మండల వ్యవసాయ అధికారి గంగా జమున సెలవుల్లో ఉండటంతో రైతులకు టోకెన్లు ఇచ్చేవారు లేక పీఏసీఎస్‌ సిబ్బంది గన్నీ సంచులు ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉన్నతాధికారులు సెలవులపై వెళ్తూ ఇన్‌చార్జి ఏఈఓలను నియమించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు, మరల వర్షాలు కురిస్తే వరి ధాన్యం, మక్కలు తడిచే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పీఏసీఎస్‌ చైర్మెన్‌ శరత్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామం సమీపంలోని ఖమ్మం-వరంగల్‌ జాతీయ రహదారిపై బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి.

Spread the love