బెస్ట్‌ క్లైమాక్స్‌

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నేడు (గురువారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దర్శకురాలు నందిని రెడ్డి బుధవారం మీడియాతో ముచ్చటించారు. ‘ఇది కొత్త పాయింట్‌తో ఉండే సినిమా. సంతోష్‌, మాళవికతో పాటు మిగిలిన పాత్రలకూ ప్రాధాన్యత ఉన్న కథ ఇది. విక్టోరియా పురం అనే ఊరి కథ. ఆ ఊరికి ఈ పాత్రలకు సంబంధం ఏమిటి?, లవ్‌ స్టోరీకి ఏమిటి సంబంధం?
ఇలా అన్ని లింక్‌తోనూ ఉంటాయి. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో ఉన్నదే విక్టోరియా పురం. కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడ చెఫ్‌ పెట్టే కాఫీని రాణి చాలా ఇష్టంగా తాగుతారు. అలా ఆ ఊరు ఫేమస్‌ అయింది. కాఫీ ఎస్టేట్‌, రెండు కుటుంబాలు, నాలుగు జనరేషన్స్‌, కోర్టు కేసు ఇలా అన్ని అంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ సినిమా ఉంటుంది. అసలు ఇలాంటి కథకు చాలా పాత్రలు ఉండటం, వారికి తగిన న్యాయం చేయడం అనేదే గొప్ప ఛాలెంజ్‌. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్‌ క్లయిమాక్స్‌ ఈ సినిమాకు రాశాననుకుంటున్నా. చివరి 20 నిముషాలపై నా కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే 30మందికిపైగా బయటివారు, సెన్సార్‌ వారూ చూశాక ది బెస్ట్‌ అన్నారు. ఇందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఈ సినిమాకు మిక్కీ సంగీతం చాలా హెల్ప్‌ అయింది’ అని తెలిపారు.

Spread the love