రాష్ట్రంలో విద్యారంగంపై నిర్లక్ష్యం

Neglect of education in the state– కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలు ఉన్నా.. లేనట్టే
– విద్యావ్యవస్థను బలోపేతం చేయాలి
– ఎన్నికల వాగ్ధానాలు నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యారంగం పెద్దఎత్తున నిర్లక్ష్యానికి గురైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్‌ టీచర్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నర్సిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ తదితర రుగ్మతలతో మృతిచెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయూష్‌మాన్‌ భారత్‌, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాలు ఎందుకూ ఉపయోగపడటం లేదన్నారు. ప్రజలు రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్ధానాలు నమ్మి మోసపోవద్దన్నారు. యూటీఎఫ్‌ సభ్యులకు మాత్రమే ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ పథకం ఉపయోగపడుతుందన్నారు. మొదటిసారిగా ఎఫ్‌డబ్య్లూఎఫ్‌ పథకం ద్వారా ఆర్థిక విరాళం చెక్కును భద్రాద్రి జిల్లాలో అందిస్తున్నామని తెలిపారు. కేంద్రం విద్యారంగ అభివృద్ధికి నిధులు ఇస్తూ రాష్ట్రంపై ఆంక్షలు పెట్టడాన్ని విమర్శించారు. విద్యా వ్యవస్థ పటిష్టం కావాలంటే మానిటరింగ్‌ చేసే వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు డీఈఓలు ఉన్నారని, 22 జిల్లాలకు పూర్తిస్థాయి డీఈఓలు లేరని, 26 జిల్లాల్లో ఎఫ్‌ఏసీలతో నడిపిస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యావ్యవస్థ బలోపేతంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికైనా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు ఇవ్వాల్సి ఉండగా, 15వ తేదీన వేతనాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను విస్మరించి ప్రయివేటు విద్యావిధానాన్ని పెంచి పోషిస్తుందని, ఇంటర్‌ 72 శాతం, డిగ్రీ 75 శాతం, ఇంజనీరింగ్‌ 90 శాతం ప్రయివేటు విద్యగా మారిందని చెప్పారు. సమావేశంలో టీఎస్‌ యూటీఎఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మెన్‌ కె.జంగయ్య, కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, సహాయ కార్యదర్శి టి.లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిషోర్‌ సింగ్‌, ఎన్‌.కృష్ణ, ఉపాధ్యక్షులు వరలక్ష్మి, కోశాధికారి ఎస్‌.వెంకటేశ్వర్లు, జిల్లా ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ కన్వీనర్‌ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love