కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజుల దందాను అరికట్టాలి

– అరెస్టులపై నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
– ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలి
– వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్‌
– రాష్ట్ర వ్యాప్త బంద్‌ విజయవంతం
– మంత్రుల నివాస సముదాయాల ముట్టడి ఉద్రిక్తం
– నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
– ఖమ్మంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ దౌర్జన్యం
నవతెలంగాణ-బంజారాహిల్స్‌/విలేకరులు
విద్యారంగ సమస్యలు పరిష్కారించాలని, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ విజయవంతమైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో శాంతియుతంగా బంద్‌ కార్యక్రమం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మంత్రుల నివాస ముట్టడికి వెళ్లిన నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి.. చొక్కాలు చింపి లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో బంద్‌ పాటించాలని కోరిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకత్వంపై ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం బౌన్సర్లతో దాడి చేయించడాన్ని విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీలు ఖండించాయి. అరెస్టులను ఖండిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాల ముట్టడికి ప్రయత్నించిన వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు నాయకులు ఆర్‌ఎల్‌ మూర్తి, టి.నాగరాజు(ఎస్‌ఎఫ్‌ఐ), పుట్టా లక్ష్మణ్‌(ఏఐఎస్‌ఎఫ్‌), పరుశరాం, ఎస్‌.నాగేశ్వరరావు, రామకృష్ణ, మహేష్‌ (పీడీఎస్‌యు), మల్లేష్‌ (ఏఐడీఎస్‌ఓ), గవ్వ వంశీధర్‌రెడ్డి(ఏఐఎస్‌బి), మురళీ (ఏఐఎఫ్‌డీఎస్‌), విజరు(పీడీఎస్‌యు(వి)) మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం సక్రమంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల్లో సౌకర్యాలు లేవన్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో టీచర్స్‌ లేరని, రాష్ట్రంలో 24 వేల టీచర్స్‌ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. మన ఊరు -మన బస్తీ – మన బడి పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేయాలని కోరారు.
రాష్ట్రంలో కార్పొరేట్‌, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. లక్షల రూపాయల ఫీజులు, డొనేషన్ల పేరుతో దోచుకుంటున్నా కనీసం ప్రభుత్వం తల్లిదండ్రులకు భరోసానిచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బడ్జెట్‌ పాఠశాలలకు ఎలాంటి రాయితీలూ ఇవ్వడం లేదని, కార్పొరేట్‌ విద్యాసంస్థల మాదిరిగా కమర్షియల్‌ ట్యాక్స్‌, కరెంట్‌ బిల్లులు, వాటర్‌ బిల్లులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కనీసం కమర్షియల్‌ పరిధిలో నుంచి డొమెస్టిక్‌ పరిధిలోకి మార్చాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న కాలంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడి సందర్భంగా పోలీసులుకు, విద్యార్థులకు తీవ్ర తోపులాట జరిగింది. లాఠీలతో విద్యార్థులను కొడుతూ.. చొక్కాలు చించి లాక్కెళ్లారు.
ఖమ్మం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ దౌర్జన్యం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతం అయింది. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. కానీ ఖమ్మం నగరంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బంద్‌ నిర్వహించడానికి వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులపై పాఠశాల యాజమాన్యం రౌడీలను పట్టి దాడి చేయించింది. గాయపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాడిని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌), ప్రజాపంథా, న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్‌, నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు, మందుల రాజేంద్రప్రసాద్‌ ఖండిస్తున్నట్టు పత్రిక ప్రకటనలో తెలిపారు. అన్ని విద్యా సంస్థలు బంద్‌కు సహకరించాయని, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం మాత్రమే సహకరించకుండా.. అక్కడికి వెళ్ళిన విద్యార్థి నాయకులపై నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, శ్రీనివాసరావు కిరాయి గూండాలతో దాడిచేయించి గాయపరిచారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పోలీసులకు తప్పుడు రిపోర్టు ఇచ్చి అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చరిత్రలో ఏ విద్యా సంస్థా ఇటువంటి గూండాగిరికి పాల్పడలేదన్నారు. అన్ని నిబంధనలను ఉల్లంఘించి, విపరీతమైన ఫీజులతో విద్యార్థులను పీడిస్తూ, గూండాలను పెంచి పోషించి బరితెగించి వ్యవహరిస్తున్న ఢిల్లీ స్కూల్‌ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.

Spread the love