బీజేపీ వ్యతిరేకశక్తులను కేసీఆర్‌ విడదీసే ప్రయత్నం

– కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం
– ఒక్క ఎకరాకూ నీళ్లివ్వకుండా రూ.80వేలకోట్లు ఖర్చు
– ప్రజాభిమానం ముందు తోకముడిచారు
– జనగర్జన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఖమ్మం
పాట్నాలో జరిగిన బీజేపీ వ్యతిరేక పార్టీల కూటమి సమావేశానికి వచ్చిన అఖిలేష్‌యాదవ్‌తో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో విడిగా మంతనాలు జరుపుతూ ఐక్యమవుతున్న కూటమి పక్షాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఇలా బీజేపీకి మేలు చేయడానికి బీఆర్‌ఎస్‌ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు వేసిన ప్రతి ఓటూ బీజేపీకే చెందుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాలని కోరారు. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం (సంజీవరెడ్డి భవనం)లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు మూడు నెలల నుండే జిల్లా, మండల కాంగ్రెస్‌ కమిటీల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. ఇది జిల్లా అధికార యంత్రాంగానికి కూడా తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవాలని, విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. అయినా ప్రజా అభిమానం ముందు వారి ప్రయత్నాలు విఫలం చెందాయని తెలిపారు. తండోపతండాలుగా ప్రజలు హాజరై సభను విజయవంతం చేశారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ద్వారా అదనంగా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రచార ఆర్పాటాలతో 45 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాగ్‌ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విధానాలను తప్పు పట్టిందని గుర్తుచేశారు. ఒక్క ఎకరానికి నీరు ఇవ్వకుండా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ళ కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్లు రాకుండా చేస్తున్నారని అన్నారు. అనంతరం ఖమ్మం మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ మడుపల్లి భాస్కర్‌ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, టీనీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, వడ్డే నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం, రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు దాసరి దానియల్‌, పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కన్వీనర్‌ బుల్లెట్‌ బాబు, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.

Spread the love