లష్కర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

లష్కర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి– కాంగ్రెస్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి దానం నాగేందర్‌
– మతతత్వ బీజేపీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి : వీహెచ్‌
– ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి దానం : డీసీసీ అధ్యక్షులు రోహిన్‌ రెడ్డి
నవతెలంగాణ-అంబర్‌పేట
కాంగ్రెస్‌ పార్టీ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించి లష్కర్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని చే నెంబర్‌ చౌరస్తాలోని మహారాణా ప్రతాప్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ రోహిన్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నదని, ఆ పార్టీ అభ్యర్థి కిషన్‌ రెడ్డికి పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ కూడా దక్కదని అన్నారు. కేంద్ర మంత్రిగా అంబర్‌పేట నియోజకవర్గానికి ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఐదు సంవత్సరాలు గడిచిపోయినా అంబర్‌పేట ఫ్లైఓవర్‌ పనులు పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో కొన్ని పరిస్థితుల వల్ల తాను పార్టీ మారానని.. మళ్లీ సొంత గూటికి తిరిగి రావడంతో పక్షికి రెక్కలు వచ్చిన విధంగా ఉందన్నారు. ప్రతి కార్యకర్త ప్రతి రోజూ 50 మంది ఓటర్లను కలిసి కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను వివరించి వారిని చైతన్యం చేయాలని తెలిపారు. బీఆర్‌ఎస్‌ తనపై కోర్టులో కేసు వేసిందని, దానికి సమయం వచ్చినప్పుడు కోర్టులోనే సమాధానం చెప్తానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సరైన సమయంలో అవకాశాలు కల్పిస్తామన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ అవినీతి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తే నిజమైన కాంగ్రెస్‌ వారికి అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. నయీం ఆస్తుల విషయంలో పోలీసులతో బీఆర్‌ఎస్‌ కుమ్మకై కొట్టేసిందని, వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మతతత్వ బీజేపీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. డాక్టర్‌ రోహిన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి తెలంగాణ నుంచి కనీసం 14 సీట్లు గెలవాలన్నారు. ఐదేండ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి.. బీజేపీ కార్యకర్తలకూ సహాయం చేయని దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ త్వరలోనే ఖాళీ అవుతుందని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, డీసీసీ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ, మాజీ కార్పొరేటర్లు దిద్ది రాంబాబు, గరిగంటి శ్రీదేవి రమేష్‌, పులి జగన్‌, జ్ఞానేశ్వర్‌ గౌడ్‌, నారాయణస్వామి, సీనియర్‌ నాయకులు తోలుపునూరి కృష్ణ గౌడ్‌, లక్ష్మణ్‌, శంభుల శ్రీకాంత్‌ గౌడ్‌, లక్‌ పతి యాదగిరి గౌడ్‌, పోలినేని రామ్మోహన్‌ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love