రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్‌ గోబెల్స్‌ ప్రచారం

– అవి సమర్థవంతంగా అమలు కావాలని మెహన్‌ భగవతే చెప్పారు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు కావాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్ల పేరుతో బీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌ ఆరోపణలకు సంబంధించి ఒక్క సాక్ష్యాన్ని అయినా చూపించగలరా? అని సవాల్‌ విసిరారు. బీసీ రిజర్వేషన్లను నీరుగార్చిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు.. మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, వైద్యాన్ని అందకుండా అది చోధ్యం చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుందనే భయంతోనే ఆపార్టీ కల్లిబొల్లి మాటలు చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో అమిత్‌ షా చేసిన ఉపన్యాసాన్ని కాంగ్రెస్‌ మార్ఫింగ్‌ చేసిందని ఆరోపించారు. అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ ఎజెండా అని సీఎం అంటున్నారనీ, కానీ రాష్ట్రంలో బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. వారి రిజర్వేషన్లు వారికే దక్కాలంటే బీజేపీను గెలిపించాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, లేదంటే గద్దె దిగిపోవాలనీ, తప్పయిపోయిందని లెంపలేసుకోవాలని రేవంత్‌కు సూచించారు.

Spread the love