కాంగ్రెస్సే టార్గెట్‌

Congress is the target– ఎమర్జెన్సీ పేరిట పార్లమెంట్‌లో స్పీకర్‌ ప్రసంగం
– ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహం
– పార్టీలకతీతంగా ఉండాల్సిన పదవి దుర్వినియోగం
– ఇదంతా మోడీ కనుసన్నల్లోనే
– రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, మేధావుల ఆందోళన
ప్రస్తుతం ఢిల్లీలో తాగు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఆపద సమయంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. ఢిల్లీ సర్కారుకు సహకరించాల్సిందిపోయి, ఆ అంశాన్ని రాజకీయం చేస్తున్నది. తాగునీటిని కల్పించే బాధ్యత ఢిల్లీ ప్రభుత్వానిదనీ, ఇందులో కేజ్రీవాల్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని బీజేపీ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో విరివిగా ప్రచారం చేసుకుంటున్నది. అయితే, ప్రధాన స్రవంతి మీడియా ఈ సమస్య గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పటంలో విఫలమైందనీ, కొన్ని ఛానెళ్లు పని గట్టుకొని మోడీ సర్కారుకు అనుకూలంగా పని చేస్తూ కేంద్రం తప్పులను కప్పి పుచ్చే ప్రయత్నాలను చేస్తున్నాయని మేధావులు, సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు.
న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ కొలువుదీరి, స్పీకర్‌ ఎన్నిక ముగిసింది. స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్‌ పదవికి జరిగిన పోటీలో ఎన్డీఏ నిలబెట్టిన ఓం బిర్లా విజయం సాధించారు. అయితే, లోక్‌సభను అధికార బీజేపీ తన ఆయుధంగా వాడుకుంటూ, స్పీకర్‌ పదవిని దుర్వినియోగం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. గతంలో జరిగిపోయిన ఎమర్జెన్సీ అంశాన్ని లేవదీస్తూ లోక్‌సభలో స్పీకర్‌ ప్రసంగించారు. ఇందులో ప్రజాస్వామ్యం, నియంతృత్వ ప్రమాదాల గురించి గంభీరమైన భావాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎమర్జెన్సీ వార్షిక దినం సమయంలోనే లోక్‌సభ సెషన్‌ జరగటమనేది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని వీరు చెప్తున్నారు. ప్రభుత్వం, పార్టీలకతీతంగా ఉండాల్సిన స్పీకర్‌ ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారని అంటున్నారు. ఇది ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే వ్యూహమనీ, మోడీ సర్కారు లోక్‌సభ సమావేశాలను దుర్వినియోగపరుస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
ఎమర్జెన్సీకి మించిన పరిస్థితులు మోడీ పదేండ్ల పాలనలో కనిపించాయనీ, ప్రతిపక్షం లేకుండా కేవలం తమ ఆలోచనలనే ప్రయోగించాలన్న కాషాయపార్టీ తీరును గ్రమించిన దేశ ప్రజలు.. కాంగ్రెస్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్న ‘ఇండియా’ బ్లాక్‌కు 234 సీట్లను కట్టబెట్టారని చెప్తున్నారు. స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల విషయంలో మనం ఎక్కడున్నాం? భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టేందుకు, మీడియాపై ఆంక్షలు విధించే కొన్ని చట్టాలు, నిబంధనలను మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందన్న సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఎమర్జెన్సీని తలపించే చర్యలను తిప్పికొడుతుందా? అని మేధావులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ”ఆనాటి ప్రభుత్వం(ఎమర్జెన్సీ కాలంనాటి) తప్పులను, అత్యవసర పరిస్థితి నష్టాలను, ఘోరమైన తప్పులను మోడీ ప్రభుత్వం పునరావృతం చేయకూడదు. ఇటీవలి కాలంలో భావప్రకటన స్వేచ్చపై దాడి తీవ్రమైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీలు ప్రతిపక్ష నాయకులను ఎంపిక చేసుకోవటం, రాజకీయ ఖైదీలు, కార్యకర్తలు, జర్నలిస్టులను విచారణ లేకుండా జైలులో ఉంచడానికి కఠినమైన నిరోధక నిర్బంధ చట్టాలు, వారిపై అభియోగాలు మోపటం వంటివి కూడా ఇందులో ఉన్నాయి” అని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాథమిక హక్కుల విషయంలో కాంగ్రెస్‌పై దాడి చేయటం ద్వారా, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తడానికి ఐక్య ప్రతిపక్షం చేసే ఏ ప్రయత్నాన్నైనా తిప్పికొట్టడానికి ప్రభుత్వం స్పష్టంగా ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏమైనా నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలని వారు అంటున్నారు.
సమస్యలపై మీడియాలో వార్తలేవి?
ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది. ప్రభుత్వానికి ఒక ప్రతిపక్షంలా పని చేస్తూ, సమాజంలోని సమస్యలను పాలకుల దృష్టికి తీసుకొచ్చే ఒక సాధనమిది. అలాంటి మీడియా తన బాధ్యతను విస్మరిస్తున్నదనీ, సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిపోయి.. మీడియా పేరు చెప్పుకొనే కొన్ని సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నదా అని మేధావులు అంటున్నారు. ఉత్తర భారత్‌లో అధిక ఉష్ణోగ్రలు నమోదవుతున్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పేదలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు దేశంలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. కనీస వేతనాలకు నోచుకోలేకపోతున్నారు. అయినప్పటికీ, ప్రధాన స్రవంతి మీడియా మాత్రం ఈ సమస్యలను పట్టించుకోకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. పేదల సమస్యలను పక్కనబెట్టి, పెద్దల బాధలనే చూపిస్తూ లాభార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయని చెప్తున్నారు మేధావులు. కరోనా మహమ్మారి కాలంలో మోడీ సర్కారు దేశంలో నమోదవుతున్న మరణాలను తక్కువ సంఖ్యలో చూపించే ప్రయత్నాన్ని చేయటం, ఆక్సిజన్‌ సిలిండర్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులను అనుభవిస్తుండటం వంటివి అనేకం చోటు చేసుకున్నా.. బాధ్యత కలిగిన మీడియా ఆ సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టే కథనాలను అందించలేకపోయింది.

Spread the love