హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి : కాంగ్రెస్‌

-నవతెలంగాణ – చంఢీఘర్: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి,  రాష్ట్రపతి పాలన విధించాలని బుధవారం కాంగ్రెస్‌ కోరింది.  ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్‌ సాంగ్వాన్‌, రణధీర్‌ సింగ్‌ గొల్లెన్‌, ధరమ్‌పాల్‌ గోండర్‌లు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు లేఖ రాయనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారని, వారు మా పార్టీకి మద్దతు ఇచ్చారని హర్యానా కాంగ్రెస్‌ చీఫ్‌ ఉదరు భాన్‌ అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని, వారికి అధికారంలో కొనసాగే హక్కులేదని అన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ముగ్గురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరణకు సంబంధించి ఇప్పటికే గవర్నర్‌కు లేఖలు పంపారని భాన్‌ తెలిపారు. బీజేపీని వ్యతిరేకిస్తూ బీజేపీ, ఐఎన్‌ఎల్‌డి, స్వతంత్ర ఎమ్మెల్యే బాల్‌రాజ్‌ కుందులను కూడా లేఖలు రాయాల్సిందిగా కోరింది. ఒకవేళ నయాబ్‌ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హుడా చర్యలు తీసుకుంటే.. ఆయనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని బీజేపీ నేత దిగ్విజరు సింగ్‌ చౌతాలా మంగళవారం పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేయాలని అన్నారు.

Spread the love