మధ్య ప్రాచ్యంలో ఏకాభిప్రాయం అవసరం

Consensus is needed in the Middle East– గాజాలో పౌరుల మరణాలకు మోడీ ఖండన
– దాడుల్లో డజన్ల సంఖ్యలో పౌరులు మృతి
– పౌర మరణాలను తగ్గించడంలో విఫలమయ్యాం : నెతన్యాహు
న్యూఢిల్లీ: గాజాలో ఘర్షణల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలో తలెత్తిన పరిస్థితులతోపాటు కొత్తగా ఆవిర్భవిస్తున్న సవాళ్లను పరిష్కరించడానికి ఏకాభిప్రాయాన్ని సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ వర్ధమాన దేశాల నేతలకు విజ్ఞప్తి చేశారు. రెండవ ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌’ సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. శుక్రవారం ఈ సదస్సును ప్రారంభిస్తూ మోడీ ప్రసంగించారు. గాజాలో జరుగుతున్న యుద్ధంలో అమాయకులైన ప్రజలు మరణించడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పరిస్థితులను సంయమనంతో ఎదుర్కొనాలని, దానితోపాటు చర్చలు, దౌత్యం కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో మాట్లాడిన తర్వాత భారత్‌ కూడా మానవతా సాయం పంపిందని చెప్పారు. మరింత విస్తృతమైన మంచి, ప్రయోజనాల కోసం వర్ధమాన దేశాలన్నీ ఒకే వాణిని వినిపించాలని ఆయన కోరారు. ‘సంప్రదింపులు, సహకారం, కమ్యూనికేషన్‌, సృజనాత్మకత, సామర్ధ్యాల రూపకల్పన” వంటి సూత్రాలను అనుసరించడం ద్వారా ”ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు” అన్న భారత్‌ నేతృత్వంలోని జి-20 థీమ్‌ కోసం అందరమూ కృషి చేయాలని అన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయిల్‌పై హమస్‌ జరిపిన ఆకస్మిక దాడులను భారత్‌ వెంటనే ఖండించింది. తీవ్రవవాద చర్య అంటూ ముద్ర కూడా వేసింది. గాజాలోని ఆస్పత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 500మందికి పైగా మరణించిన ఘటనను కూడా భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఘర్షణలు, యుద్ధాల్లో పౌరులు బలి కాకూడదని, వారి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత వుందని మోడీ పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌లోని పలు దేశాలు కూడా ఇజ్రాయిల్‌ చర్యను తీవ్రంగా ఖండించాయి. చిలీ, కొలంబియా, హోండూరస్‌ దేశాల అధ్యక్షులు ఇజ్రాయిల్‌ ప్రతిస్పందిస్తున్న తీరును తీవ్రంగా గర్హించారు. గాజాలో మానవాళికి వ్యతిరేకంగా ఘోరమైన దారుణాలు, నేరాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. పలు ఆఫ్రికా దేశాలు కూడా ఇజ్రాయిల్‌ను విమర్శించాయి. తక్షణమే అంతర్జాతీయ సమాజం స్పందించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పాయి.
ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలపై ఐసిసి విచారణ చేపట్టాలి : సిరిల్‌ రమాఫోసా
ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) విచారణ చేపట్టాలని దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది. ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులను తాము చూస్తున్నామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా గురువారం మీడియాకి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడులపై విచారణ చేపట్టాలని కోరుతున్న ఇతర దేశాలు, సంస్థలతో కలిసి సంయుక్తంగా ఐసిసిని విచారణ చేపట్టాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. గాజాలో అతిపెద్దదైన అల్‌-షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్‌ దళాలు దిగ్బంధించడంతో పాటు ఆహారం, నీరు, విద్యుత్‌ వంటి సదుపాయాను అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అక్టోబర్‌ 7 నుండి ఇజ్రాయిల్‌ చేపట్టిన దాడుల్లో గాజా, వెస్ట్‌బ్యాంకులలో సుమారు 11,517 మంది పాలస్తీనియన్లు మరణించగా, 32,000 మంది గాయాలపాలయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఎంతో మంది అమాయకమైన చిన్నారులను బలిగొన్న యుద్ధాలను చరిత్రలో చూడలేదని అన్నారు. గాజాలో నిర్బంధ శిబిరంపై మారణహోమం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని రమాఫోసా పునరుద్ఘాటించారు. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించేలా, పాలస్తీనాలోని సాధారణ పౌరులను రక్షించేలా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ నుండి తమ దౌత్యవేత్తలందరినీ వెనక్కి పిలవనున్నట్లు గతవారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
శరణార్ధ శిబిరంపై దాడి : 18మంది మృతి
గత కొద్ది గంటల వ్యవధిలో ఇజ్రాయిల్‌ జరుపుతున్న వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు డజన్ల సంఖ్యలో మరణించారని పాలస్తీనా వాఫా వార్తా సంస్థ తెలిపింది. ఖాన్‌ యూనిస్‌లోని ఇంటిని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిలో నలుగురు మరణించగా, బని సుహాలియా ప్రాంతంలో ఇంటిపై జరిగిన దాడిలో పలువురు చనిపోయారు. సెంట్రల్‌ గాజాలోని నుస్రత్‌ శరణార్ధ శిబిరంపై దాడిలో 18మంది పౌరులు మరణించారు. జాబాలియా శరణార్ధ శిబిరంపై దాడిలో డజన్ల సంఖ్యలో పౌరులు చనిపోయారు. వేలాదిమంది నిర్వాసితులు వున్న పాఠశాలపై కూడా గత రాత్రి దాడి జరిగింది. గాజాలో కమ్యూనికేషన్‌ సేవలు స్తంభించడంతో ఉదయానికి గానీ సమాచారం తెలియలేదని గాజాలోని ఇండోనేషియా ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. అల్‌ షిఫా అస్పత్రి పెద్ద జైలుగా మారిందని, లోపల వున్నవారందరికీ మూకుమ్మడి సమాధిగా తయారైందని అల్‌షిఫా ఆస్పత్రి డైరెక్టర్‌ మహ్మద్‌ అబూ సాల్మియా వ్యాఖ్యానించారు. ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వున్న వారందరూ చనిపోయారని చెప్పారు. ఆస్పత్రిని వీడేందుకు అనుమతించాల్సిందిగా వేడుకున్నామని, కానీ ఇజ్రాయిల్‌ బలగాలు తిరస్కరించాయని చెప్పారు.
పౌరుల మరణాలను తగ్గించడంలో విఫలయమ్యాం : అంగీకరించిన నెతన్యాహు
పౌరుల మరణాలను తగ్గించడంలో విఫలమయ్యామని అంతకుముందు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. ”ఎక్కువగా పౌరులు చనిపోకుండా మా ఆపరేషన్‌ ముగించాలని భావించాం, అలాగే ప్రయత్నించాం, కానీ దురదృష్టవశాత్తూ అది జరగడం లేదు.” అని ఒక టివి చానెల్‌తో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

Spread the love