వేసవిలో ఎండవేడిని తట్టుకునేందుకు చల్లని పానీయాలు తాగడానికి అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. చాలా వరకు బయట దొరికే జ్యూస్‌లు షేక్స్ మీద ఆసక్తి చూపిస్తుంటారు. బయట చేసే మిల్క్ షేక్స్‌నే ఇంట్లో కూడా వెరైటీగా చేసుకోవచ్చు. వీటికి డ్రై ఫ్రూట్స్ కూడా తోడైతే రుచి ఇంకా బాగుంటుంది. బయట అందుబాటులో ఉండే మిల్క్ షేక్స్ రుచికి ఏమాత్రం తీసిపోకుండా హెల్దీగా ఇంట్లో చేసుకుని తాగితే ఆ మజాయే వేరు.. మరెందుకు ఆలస్యం.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..!
డ్రై ఫ్రూట్ మిల్క్‌షేక్
కావాల్సిన పదార్థాలు : జీడిపప్పు – పది (ముక్కలుగా చేసుకోవాలి), బాదం పప్పు – ఐదు, కిస్‌మిస్‌లు – 10 లేదా 12, పిస్తా పప్పు – 10 లేదా 12, వాల్‌నట్స్ – మూడు, అంజీర – నాలుగు, ఖర్జూర పండ్లు – 10, టూటీ ఫ్రూటీ – ఒక టేబుల్ స్పూన్, పంచదార – 2 టేబుల్ స్పూన్‌లు, తేనె – రెండు టేబుల్ స్పూన్‌లు, వెనీలా ఎసెన్స్ – ఒక టేబుల్‌స్పూన్ లేదా యాలకుల పొడి – అర స్పూన్, పాలు – ఒక కప్పు (కాచి చల్లార్చి, కొంత సమయం ఫ్రిజ్‌లో పెట్టుకున్నవి), మిల్క్ క్యూబ్స్ – ఒక కప్పు (పాలు కాచి చల్లార్చి ఐస్ ట్రేలో పెట్టి పూర్తిగా గడ్డ కట్టే వరకు ఉంచాలి)
తయారు చేసే విధానం : పదార్థాలన్నింటినీ మిక్సి జార్‌లోకి తీసుకుని కనీసం మూడు నిమిషాలు బాగా బ్లెండ్ చేసుకోవాలి. పలుకులు లేకుండా మొత్తం మిక్సి పట్టాలి. మెత్తగా చిక్కగా బ్లెండ్ అయిన తర్వాత అందులో మిల్క్ క్యూబ్స్‌ను వేయాలి. మరో రెండు నిమిషాలు బాగా బ్లెండ్ చేయాలి. తర్వాత ఈ షేక్‌ను గ్లాసులోకి తీసుకుని సన్నగా తరిగిన బాదం, పిస్తాతో అలంకరించుకుంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ..
బనానా మిల్క్ షేక్
కావాల్సిన పదార్థాలు : పాలు – కప్పున్నర, అరటిపండ్లు – రెండు, జీడిపప్పు – ఆరు, బాదం పప్పులు – పది లేదా పన్నెండు (మూడు గంటలు నానబెట్టుకోవాలి), సబ్జా గింజలు – ఐదు టేబుల్‌స్పూన్‌లు (అరగంట నానబెట్టుకోవాలి), పంచదార – మూడు టేబుల్ స్పూన్‌లు, యాలకులు – మూడు
తయారు చేసే విధానం : పాలు కాచి చల్లార్చి గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆ పాలను మిక్సి జార్‌లోకి తీసుకోవాలి. అందులో అరటి పండ్లను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే జీడిపప్పు, పంచదార, యాలకులు వేసి మెత్తగా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బాదం పప్పులను పొట్టుతీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బ్లెండ్ చేసిన షేక్‌ను గ్లాసులోకి పోసి అందులో బాదంపప్పు ముక్కలను, సబ్జా గింజలను వేయాలి. ఇష్టపడే వారు సగం అరటి పండును సన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి స్పూన్‌తో బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి.
బాదం మిల్క్ షేక్
కావాల్సిన పదార్థాలు : పాలు : ఒక లీటర్, బాదం పప్పు – ఇరవై, కస్టర్డ్ పౌడర్ – రెండు టేబుల్ స్పూన్‌లు, కుంకుమ పువ్వు – ఇరవై రేకులు, యాలకుల పొడి – అర టేబుల్ స్పూన్, పంచదార – అర టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం : పాలను మందపాటి పాన్‌లో ఒక పొంగు వచ్చేదాక కాగనివ్వాలి. తర్వాత సన్న మంట మీద పాలు కాస్త దగ్గర పడే వరకు మరిగిస్తూ ఉండాలి. రాత్రంతా బాదంను నానబెట్టి పొట్టి తీసి ఉంచుకోవాలి. వీటిని మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకునేపుడు అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్‌ల పాలు పోసుకోవచ్చు. అర కప్పు పాలను తీసుకుని అందులో రెండు స్పూన్‌ల కస్టర్డ్ పౌడర్‌ను కలపాలి. తర్వాత స్టవ్ మీద మరుగుతున్న పాలను కలుపుకుంటూ అందులో కుంకుమ పువ్వు రేకులు వేసి బాగా కలపాలి. అందులోనే యాలకుల పొడి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు మరిగించిన తర్వాత అర స్పూన్ పంచదార వేసుకోని బాగా కలపాలి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్టును వేసి బాగా కలపాలి. మరో నాలుగు నిమిషాలు ఉడికించాలి. పాలు క్రీమ్ లాగా మారుతుంటాయి. ఇందులో కస్టర్డ్ పౌడర్ కలిపి ఉంచుకున్న పాలను కూడా మెల్లగా పోస్తూ కలపాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కాస్త చిక్కబడే వరకు మరిగించి దించుకోని చల్లారిన తర్వాత రెండు నుంచి మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్‌లలోకి తీసుకుని సన్నగా తరిగిన బాదం, పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
పోషకాలు..
– బాదంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
– జీడిపప్పులో విటమిన్ ఇ, బి6 పుష్కలంగా ఉంటాయి. మంచి ఫ్యాట్‌ను కలిగి ఉంటాయి.
– వాల్‌నట్స్‌లో శరీరానికి కీలకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి.
– పిస్తాపప్పు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తాయి. మధుమేహాన్ని నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.
– ఖర్జూరంలో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, సహజ చక్కెర పుష్కలంగా ఉంటాయి.
– అరటి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.