ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉభయ రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన శాసన మండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అండతో కార్పొరేట్‌ శక్తులు ఎన్నిక కావటం ప్రభుత్వ విద్యారంగానికి ప్రమాదకరమంటూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకుని అధికార దుర్వినియోగంతో పాటు, వివిధ రకాల ప్రలోభాలకు గురిచేయటాన్ని వారు ఖండించారు. టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఆఫీసుబేరర్ల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ యూటీఎఫ్‌ పక్షాన పాపన్నగారి మాణిక్‌ రెడ్డిని అభ్యర్థిగా నిలిపి ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన, పోరాటాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధ్యాయ, విద్యారంగ వ్యతిరేక అంశాలను ప్రతిఘటించాల్సిన అవసరం గురించి ఆరునెల్ల పాటు నియోజకవర్గంలోని విద్యా సంస్థల్లో విస్తృత ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఆయా అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏవిధమైన అనైతిక విధానాలకు పాల్పడకుండా నిబద్దతతో వ్యవహరించి గత ఎన్నికల కంటే 50శాతం ఓట్లను అదనంగా సాధించినట్టు పేర్కొన్నారు. రాజకీయం, డబ్బు, కులం, మతం తదితర ఒత్తిళ్ళను అధిగమించి 4,569 మొదటి ప్రాధాన్యత ఓట్లతో సహా మొత్తంగా 6,069 ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలపై పోరాటాలు చేయకుండా, ఐక్య ఉద్యమాల్లో కలిసి రాకుండా అహంభావంతో వ్యవహరించిన ఒక సంఘం ఎన్నికల అవసరం కోసం పలుసంఘాల మద్దతు తమకు లభించినట్లు ప్రకటించుకున్నా.. ఉపాధ్యాయులు ఆదరించలేదని తెలిపారు. ఇదే సమయంలో తమ వైఫల్యాలను స్వీయ విమర్శనాత్మకంగా విశ్లేషించుకుని వైఖరిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీపీిఎస్‌, ఇన్‌కంటాక్స్‌ భారాలను ఉద్యోగులపై మోపిన, జాతీయ విద్యావిధానం పేరిట ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేయబూనుకున్న బీజేపీ ఉపాధ్యాయ ఎన్నికల్లో నేరుగా తన అభ్యర్థిని నిలబెడితే ఓడించాల్సిన ఉపాధ్యాయులు ఆ ప్రమాదాన్ని అంతగా గుర్తించలేక పోవటం విచారకరమని తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా విద్యారంగ శ్రేయస్సు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం టీఎస్‌యూటీిఎఫ్‌ పక్షాన పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. సమావేశంలో కోశాధికారి టి లక్ష్మారెడ్డి, అభ్యర్ధి పత్రికా సంపాదకులు పి మాణిక్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఇ గాలయ్య, ఎస్‌ రవిప్రసాద్‌ గౌడ్‌, ఎ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Spread the love