ఆర్థిక భారంలో పత్తి రైతులు

– ప్రకృతి వైపరీత్యం.. కలిసిరాని కాలం
– పంట దిగుబడి రాక.. ధర లేక తీవ్ర నష్టం
– నిన్నటి వరకు ఇండ్లలోనే భారీగా నిల్వలు
– ఖరీఫ్‌ ముంచుకొస్తుండటంతో గత్యంతరం లేక విక్రయం
– పంట నష్టం జరిగినా.. ఆదుకోని ప్రభుత్వాలు
– గత్యంతరం లేక విక్రయించాను
ఐదెకరాల్లో పత్తి సాగు చేశాను. సుమారు 50క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. తొలుత క్వింటాల్‌కు రూ.8300 ధరకు రెండు క్వింటాళ్లు విక్రయించాను. ధర పెరుగుతుందనే ఆశతో మిగతా పత్తినంతా ఇంట్లోనే నిల్వ చేశాను. ధరలో తేడా లేకపోవడం.. క్వింటాల్‌ రూ.6600కు పడిపోవడంతో గత్యంతరం లేక మహారాష్ట్రకు వెళ్లి విక్రయించాను. ఈ ఏడాది ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది.
– రైతు నానయ్య- కౌటాల
నవతెలంగాణ-
ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, కౌటాల
పత్తినే జీవనాధారంగా చేసుకొని సాగు చేసిన అన్నదాతలు ఆర్థికభారంలో కూరుకుపోయారు. పంట సాగు ప్రారంభం నుంచే పంట ఎదుగుదలను కోల్పోయింది. పూత, కాత దశలోనూ ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరానికి కనీసం 10క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 5 నుంచి 6క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. వచ్చిన పంటను మార్కెట్‌లో అమ్ముకుందామంటే సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. మంచి ధర వచ్చినప్పుడు విక్రయిద్దామని రాష్ట్ర వ్యాప్తంగా నెలల తరబడి ఇండ్లల్లోనే పత్తిని నిల్వ చేశారు. మళ్లీ పత్తి గింజలు నాటే కాలం వచ్చినా.. పత్తికి ధర పెరగకపోగా మరింత తగ్గింది. దాంతో గత్యంతరం లేక వచ్చినకాడికి పంటను అమ్మేస్తున్నారు. తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పత్తి పంటను పరిశీలించగా.. అధిక శాతం జిల్లా రైతాంగం ఈ పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తోంది. కిందటేడాది ఉమ్మడి జిల్లాలో సుమారు 11లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. ఈ లెక్కన సుమారు 80లక్షల క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ 2022-23 ఖరీఫ్‌ ప్రారంభం నుంచి అధిక వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పొలాల్లో నీళ్లు నిల్వ ఉండి పోయాయి. రోజుల తరబడి నీళ్లు నిల్వ ఉండటం కారణంగా మొలకలు మురిగిపోయి ఎదుగుదల లోపించింది. ఒక్కో రైతు రెండు నుంచి మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఇదే నష్టం అనుకుంటే.. పంట ఎదిగిన దశలోనూ రోజుల తరబడి వర్షాలు కురవడంతో పూత, కాత రాలిపోయి దిగుబడిపై ప్రభావం చూపించింది. పత్తి తీసే వరకు వర్షాలు కురుస్తూనే ఉండటంతో రోజుల తరబడి చేన్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎకరానికి 5 నుంచి 6క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వచ్చిన పంటను అమ్ముకుందామన్నా మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఆదిలాబాద్‌ జిల్లాలో 4లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరానికి 8క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా వేస్తే సుమారు 32లక్షల పంట దిగుబడి రావాల్సి ఉంది. కానీ 15 నుంచి 16లక్షల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇందులో కేవలం 10లక్షల క్వింటాళ్లు మాత్రమే మార్కెట్‌కు వచ్చింది.
మహారాష్ట్రకు తరలిన పత్తి..!
ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6380 నిర్ణయించగా.. మార్కెట్‌లో తొలుత క్వింటాల్‌కు రూ.8500వరకు పలికింది. కొన్ని రోజులు మాత్రమే నిలకడగా ఉన్న ఈ ధర అనతి కాలంలోనే రూ.7950కి దిగజారింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతులు పత్తిని విక్రయించలేదు. కొందరు రైతులు మహారాష్ట్రలోని సమీప మార్కెట్‌లకు తరలించి అనువైన ధరకు పత్తిని విక్రయించారు. చాలా మంది రైతులు నెలల తరబడి క్వింటాళ్ల పంటను ఇంట్లోనే నిల్వ ఉంచారు. ధర మరింత తగ్గుతూ రూ.6600కి పడిపోయింది. దీంతో దిగులు చెందిన అన్నదాతలు మార్కెట్‌కు తరలించి తక్కువ ధరకు విక్రయించారు. ఈ నెల 30వ తేదీ వరకే మార్కెట్లు తెరిచి ఉండే అవకాశం ఉండటంతో పత్తిని అలాగే ఉంచితే ఇబ్బందులు వస్తాయని భావించి గత్యంతరం లేక తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ వాణిజ్యపరంగా కొనుగోళ్లు చేపడతామని చెప్పినా ప్రయివేటు వ్యాపారులతో సమానంగా ధర నిర్ణయించడంతో ఈ సంస్థకు రైతులెవరూ పత్తిని విక్రయించలేకపోయారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పత్తి సాగుకు సరైన ప్రోత్సాహం కల్పించలేదు. కొనుగోలు కోసం బడ్జెట్‌లో నిదులు అధిక మొత్తంలో కేటాయించలేదు. దీంతో మార్కెట్‌లో వ్యాపారులు కూడా మంచి ధర ఇవ్వడం లేదు. ఇంత జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకుండా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. పత్తి అమ్మకాలు ముగిసిపోయాయనే కారణంగా జిన్నింగ్‌ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడం.. ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తుండటంతో ఆందోళన చెందిన అన్నదాతలు పత్తిని విక్రయిస్తున్నారు.
రైతులు పత్తినంతా విక్రయించారు
శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ ఏడీ, ఆదిలాబాద్‌
జిల్లాలోని రైతులు 95శాతం పత్తిని విక్రయించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మార్కెట్‌కు 10లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి వచ్చింది. కొందరు రైతులు మహారాష్ట్రలో విక్రయించినట్టు తెలిసింది. ఈ నెల 30వ తేదీతో మార్కెట్లు మూతపడుతాయి. రైతుల వద్ద పత్తి ఉంటే వెంటనే విక్రయించాలి.

Spread the love