కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌
నవతెలంగాణ – మెదక్‌
అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా, నవంబర్‌ 30వ తేదీన జరిగిన పోలింగ్‌ అనంతరం ఈనెల 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరుగునున్న కౌంటింగ్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుండి ఇతర అదనపు ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో కౌంటింగ్‌ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో టేబుల్లు, కౌంటర్లు, మీడియా, రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ఏజెంట్లు ఇతరత్రా అన్ని ఏర్పాట్లను నిబంధనలకు లోబడి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్‌ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌ రెండు నియోజకవర్గాలకు కలిపి జిల్లా కేంద్రంలోని వైపిఆర్‌ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసి పూర్తి బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ర్యాండం ప్రకారం వివి ప్యాట్లలోని స్లిప్పులు లెక్కింపు జరుగుతుందని, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేంకటేశ్వర్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love