పనులు పూర్తి చేశాక కోర్టుకొస్తే ఉత్తర్వులు ఇవ్వలేం

– రెండు పడకల ఇండ్ల పనుల కేసులో హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్‌
మన్‌సాన్‌పల్లి ఫేజ-1, ఫేజ్‌-2లో 2,412 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ కేటాయింపును సవాల్‌ చేసిన పిల్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఎలాంటి టెండర్‌ ప్రక్రియ లేకుండా కాంట్రాక్ట్‌ పనులను డీఈసీ ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించడాన్ని నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలు చేశారు. ఇండ్ల నిర్మాణాలు జరిగిపోయాయని, వాటిని లబ్దిదారులకు కేటాయింపులు కూడా జరిగాయని, ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టును సవాల్‌ చేసిన పిల్‌లో ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. పిల్‌ను కొట్టేస్తూ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌అరధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం తీర్పు వెలువరించింది. గట్టుపల్లిలో 1,192 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మునుగూరులో 1,296 ఇండ్ల నిర్మాణ పనుల్ని కూడా కాంట్రాక్టర్‌కు ఇచ్చింది. వీటిని 2020 నాటికి పూర్తి చేయలేక కాంట్రాక్ట్‌ను కాంట్రాక్టర్‌ వదిలేయడంతో ప్రభుత్వం డీఈసీ ఇన్‌ఫ్రాÛస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించింది. 2020లో ఇండ్ల నిర్మాణాలకు కాంట్రాక్ట్‌ అప్పగిస్తే వాటిని 2022 నాటికి పూర్తి చేసిందని, ఆ తర్వాత పిల్‌ దాఖలు చేయడం సరికాదంది. గతంలోని మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. కాంట్రాక్టర్‌కు చట్ట ప్రకారం బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Spread the love