– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్
– ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు..
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గుగ్గీల్ల,పోతారం గ్రామ శివారుల్లో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ వల్ల మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని రానున్న భవిష్యత్తు తరాల దృష్ట్యా పరిశ్రమల నిర్మాణాలను ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. గుగ్గీల్ల,పోతారం గ్రామాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా పరిశ్రమల యాజమాన్యాలు కొందరి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులను మభ్యపెట్టి దొంగచాటుగా అభ్యంతరం లేదని అనుమతులు పొందారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం అరాటపడుతూ పరిశ్రమల వల్ల కలిగే అనర్థాల దృష్టితో నిర్మాణాలపై అయా గ్రామాల ప్రజలు నిరసనలు చేపడుతూ పోరాటాలు చేస్తూంటే, పోలీస్ యంత్రాంగం పరిశ్రమల యాజమాన్యాల పక్షాన నిలబడడం ప్రజల పోరాటాలను అణచివేయడమేనన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు,పోలీస్ యంత్రాంగం యాజమాన్యాలకు తోత్తులుగా వ్యవహరించకుండా ప్రజల పక్షాన నిలబడాలని లేని పక్షంలో ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో ప్రజలతో పాటు సీపీఐ(ఎం) పాలుపంచుకుని పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయిక్రిష్ణ,సంగ ఎల్లయ్య,బోనగిరి దుర్గయ్య పాల్గొన్నారు.