నాలుగు ఎంపీ స్థానాల్లో సీపీఐ(ఎం) విజయం

CPI(M) wins four MP seats– తమిళనాడులో భారీ మెజార్టీ
– ఒడిశాలో అసెంబ్లీ స్థానంలో ఘన విజయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మూడు రాష్ట్రాల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడులో రెండు, కేరళ, రాజస్థాన్‌లో ఒక్కో స్థానం గెలిచింది. తమిళనాడులో దిండిగల్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఎంఎ మహ్మద్‌ ముబారక్‌ (2,22,975)పై సీపీఐ(ఎం) అభ్యర్థి ఆర్‌. సచ్చితానందం 4,40,051 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన 6,63,026 ఓట్లతో ఘన విజయం సాధించారు. మధురై నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎస్‌.వెంకటేషన్‌ 2,09,409 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి రామ శ్రీనివాసన్‌కు 2,22,914 ఓట్లు రాగా వెంకటేషన్‌ 4,30,323 ఓట్లతో ఘన విజయం సాధించారు. రాజస్థాన్‌లో సికార్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి, రైతు నేత అమ్రారామ్‌ 72,896 ఓట్లతో బీజేపీ అభ్యర్థి సుమేధనంద్‌ సరస్వతి (5,86,404)పై ఘన విజయం సాధించారు. సీపీఐ(ఎం) అభ్యర్థి అమ్రారామ్‌ 6,59,300 ఓట్లతో విజయం సాధించారు. కేరళలో అలత్తూరు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి కే. రాధాకృష్ణన్‌ 2,011 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రమ్య హరిదాస్‌ (3,83,336)పై గెలిచారు. రాధాకృష్ణన్‌ 4,03,447 ఓట్లతో విజయం సాధించారు.
ఒడిశాలో బోనై అసెంబ్లీ స్థానం సీపీఐ(ఎం) కైవసం
ఒడిశాలోని బోనై అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ(ఎం) కైవసం చేసుకుంది. వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది. సీపీఐ(ఎం) అభ్యర్థి లక్ష్మణ్‌ ముండా 23,439 ఓట్ల భారీ మెజార్టీతో బీజేడీ అభ్యర్థి భీమ్‌సేన్‌ చౌదరి (57,569)పై ఘన విజయం సాధించారు. లక్ష్మణ్‌ ముండా 81,008 ఓట్లతో గెలుపొందారు. ఈ అసెంబ్లీ స్థానంలో ఇప్పటి వరకు 2004, 2014, 2019 మూడు సార్లు గెలవగా, ఇప్పుడూ గెలిచి హ్యాట్రిక్‌ నమోదు చేసుకుంది.

Spread the love