నిరంతర కృషితోటే అదుపులోకి నేరాలు

– పోలీసు అధికారులకు డీజీపీ దిశానిర్దేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దర్యాప్తు అధికారులు నిరంతరంగా సాగించే కృషితోనే నేరాలను అదుపులోకి తీసుకురావచ్చనీ, ఏ మాత్రమూ నిర్లక్ష్యం వహించినా అవి పెరిగే ప్రమాదమున్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. శనివారం అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు, జోనల్‌ ఐజీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నెలవారీ క్రైమ్‌ రివ్యూను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో 46 శాతం మేరకు రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అలాగే, నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైబర్‌ నేరాలను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ రెండు విభాగాలకు దర్యాప్తు బ్యూరోలను ఏర్పాటు చేసిందనీ, దీనితో పోలీసులపై మరింత పని భారం పెరిగిందని చెప్పారు. సాంప్రదాయిక దోపిడీలు, దొంగతనాలు తగ్గుముఖం పట్టటం ఒకపక్క సంతోషకరమే అయినా, మరోపక్క సైబర్‌ నేరాలు పెరిగిపోవటం ఆందోళనకరమని అంజనీకుమార్‌ అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నేరాల అదుపునకు పోలీసు అధికారులు సమిష్టిగా కృషి చేయాల్సినవసరం ఉన్నదని ఆయన తెలిపారు. ప్రతి పది సంవత్సరాలకు నేరాల రూపురేఖల్లో, నేరస్థుల ప్రవర్తనలోనూ మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల దర్యాప్తు తీరు,తెన్నుల్లోనూ విప్లవాత్మక మార్పులు రావాల్సినవసరం ఉన్నదని డీజీపీ ఆకాంక్షించారు. సమాజంలో చోటుచేసుకుంటున్న వివిధ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ, దానికి సంబంధించిన శిక్షణను కూడా అధికారులు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌తో పాటు పలువురు సీనియర్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Spread the love