నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామనీ, అందులో భాగంగా భారత వజ్రోత్సవ ప్లాంటేషన్ పేరుతో ఒక కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం సచివాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో పాటు పీసీసీఎఫ్ డోబ్రియల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హ్యాండ్లూమ్స్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఆయుష్ శాఖ కమిషనర్ హరి చందన, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. ముగింపు వేడుకల తేదీలను సీఎం కేసీఆర్ త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని సినిమాహాళ్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నామని తెలిపారు. విద్యాసంస్థల్లో వ్యాసరచన, పెయింటింగ్ తదితర కాంపిటీషన్లను, 5 కె, 2 కె రన్ లను చేపడతామని ప్రకటించారు. దేశ స్వాత్రంత్ర పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తెలిపే ఫొటో ప్రదర్శనను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని తెలిపారు.