పాలస్తీనియన్లకు క్యూబా సంఘీభావం

నవతెలంగాణ- హవానా : పాలస్తీనియన్లకు క్యూబా సంఘీభావం ప్రకటించింది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా హయ్యర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌కి చెందిన విద్యార్ధులు, కార్యకర్తలు హవానాలో సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభలో క్యూబా రాయబారి, క్యూబా, అరబ్‌ ఫ్రెండ్‌షిప్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎమిలియో కాబలెరోతోపాటు క్యూబా విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యూబాలో చదువుతున్న పాలస్తీనా విద్యార్థులు కూడా పాల్గొన్నారు. క్యూబాలో పాలస్తీనా రాయబారి అక్రమ్‌ సంహాన్‌ మాట్లాడుతూ, గాజాలో ఇజ్రాయిల్‌ బాంబుదాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేశారు. తమ ప్రజలకు మద్దతును ప్రకటించినందుకు క్యూబా నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యూబా విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రసంగించారు. వారిలో కొంతమంది తాము రాసిన కవితలను చదివి వినిపించారు. ఇజ్రాయిల్‌ ఏకపక్షంగా సాగిస్తున్న అమానుష దాడులు, చర్యలను ముక్తకంఠంతో వారు ఖండించారు. నెతన్యాహు ప్రభుత్వానికి అమెరికా, పశ్చిమ దేశాలు ఇస్తున్న బేషరతు మద్దతును వారు తీవ్రంగా నిరసించారు. పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయాలని. సార్వభౌమత్వంతో కూడిన స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు పాలస్తీనీయుల హక్కు అని వారు పునరుద్ఘాటించారు. అల్జీరియా, యెమెన్‌ రాయబారులు, క్యూబన్‌ అరబ్‌ యూనియన్‌ (యుఎసి), క్యూబన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పీపుల్‌ ఫ్రెండ్‌షిప్‌ (ఐసిఎపి)లు ఈ సంఘీభావ సభలో పాల్గొన్నాయి.

Spread the love