ఖర్చుకు సాగుకు పొంతనలేదు..

to cost Cultivation Not sure..– 97 వేల ఎకరాల ఆయకట్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు
– కమీషన్ల కోసం ప్రాణహిత చేవెళ్లకు పాతరేశారు
– తిరిగి ఆ ప్రాజెక్టును తుమ్మిడి హట్టి వద్ద నిర్మిస్తాం
– నిపుణుల కమిటీ అభిప్రాయాలను తీసుకుంటాం
– గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది
– అధికారులూ తప్పులు చేశారు
– ఎంతటి వారినైనా వదిలిపెట్టబోం
– క్యాబినెట్‌లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
– మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం
‘ప్రపంచం అబ్బురపడే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని గత ప్రభుత్వం చేసిన ప్రచారం తప్పని తేలింది. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి రూ.లక్ష కోట్ల భారీ వ్యయంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. తద్వారా 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిస్తామంటూ డాంభికాలు పలికింది. కానీ కేవలం 97 వేల ఎకరాలకు మాత్రమే నీరందించగలిగింది…’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవ విషయాలను ప్రజలకు తెలిపేందుకు ఉత్తమ్‌తోపాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కూడిన బృందం శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించింది. హెలికాప్టర్‌ ద్వారా ప్రాజెక్టును విహంగ వీక్షణం చేసిన అనంతరం వారికి సాగునీటి పారుదల ఈఎన్‌సీ మురళీధర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ… ఇంత భారీ వ్యయం చేసి నిర్మించిన ప్రాజెక్టులో ఈ యేడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ వద్ద ఏడో బ్లాక్‌లో 20వ పిల్లర్‌ కుంగి పోయిందని చెప్పారు. దీంతో దానికి ఇరువైపులా ఉన్న మరో రెండు పిల్లర్లకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ రకంగా పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కమీషన్ల కోసం కక్కుర్తి పడి అడ్డగోలు నిర్మాణాలు చేపట్టిందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల అభిప్రాయాలను తీసుకుని ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత క్యాబినెట్‌లో తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో అధికారుల తప్పిదాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నా యని తెలిపారు. చట్ట ప్రకారం వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు : మంత్రి పొంగులేటి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు నాణ్యత, రక్షణ చర్యలు, నిర్వహణ తదితరాంశాలను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. ఫలితంగా మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లు సైతం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యారేజీ అప్‌ స్ట్రీమ్‌, డౌన్‌ స్ట్రీమ్‌లను నాణ్యతగా కట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. టెండర్లపై చూపిన ఆసక్తి నాణ్యతలోగానీ, మరమ్మతుల్లోగానీ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు స్టాప్‌ లాక్‌ గేట్లు ఎందుకు పనిచేయలేదో చెప్పాలంటూ ఇంజినీర్లను మంత్రి నిలదీశారు. మేడిగడ్డ నుంచి 50 టీఎంసీల నీరు లిఫ్ట్‌ చేశారు..మూడో బ్యారేజ్‌ వద్ద 41 టీఎంసీలను లిఫ్ట్‌ చేశారు, అలాంటప్పుడు 9 టీఎంసీల నీడిని ఎక్కడ వాడారంటూ ప్రశ్నించారు.
అధికారులు అసలు విషయాలను దాస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి
ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను, అసలు విషయాలను అధికారులు దాస్తున్నారంటూ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సాంకేతికంగా తప్పుడు డిజైన్లు ఇస్తే వాటిని సరిదిద్దాల్సిన అధికారులు సర్కారుకు వంతపాడారంటూ విమర్శించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్‌ కట్టి ఉంటే తెలంగాణకు గ్రావిటీ ద్వారా సాగునీరు వచ్చి ఎంతో లాభం జరిగేదని చెప్పారు. పంపు హౌస్‌ల్లో నాణ్యత లేని మోటర్లును బిగించారని ఆయన ఆరోపించారు. పిల్లర్‌ కుంగిపోవటానికి సంబంధించి ప్రాజెక్టు పొంగడం, విద్రోహ చర్యల్లాంటి కబుర్లన్నీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించటానికి చెబుతున్నవేనని ఎద్దేవా చేశారు. వీటిపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాటకాలాడుతోం దని విమర్శించారు. ఇప్పటికైనా కాళేశ్వరం వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు అధికారులపై కూడా ఉందని వ్యాఖ్యానించారు.
తప్పుల తడక : పొన్నం
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనంతా తప్పుల తడకని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చారు?.ఎన్ని ఎకరాలు పారింది?. ఎంత కరెంట్‌ బిల్లు వచ్చిందంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా ఆయన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కోరారు.
వ్యయానికి, సాగుకు భారీ వ్యత్యాసం : శ్రీధర్‌ బాబు
కాళేశ్వరం ఖరీదైన ప్రాజెక్టని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు వ్యయానికి, సాగుకు, ఆయ కట్టుకు భారీ వ్యత్యాసముందని అన్నారు. ఎకరా భూమిని సాగు లోకి తెచ్చేందుకు రూ.46 వేలు ఖర్చవుతుండగా, ఆదా యం మాత్రం అందులో సగం కూడా రావటం లేదన్నారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే 14,344 మెగా వాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని చెప్పారు. తెలంగాణ ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్తులో 90శాతం ఈ ప్రాజెక్టుకే వినియోగిం చాల్సి ఉంటుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముంపు సమస్యను పరిష్కరించాలి ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపునకు గురైన చెన్నూరు ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం కరకట్టలు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విచారణలో అన్నీ తేలతాయి : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన అధికారులనే అడిగితే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన థర్డ్‌ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపిస్తే అప్పుడు అన్నీ తేలతాయని ఆయన చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు సమయంలో ఖర్చు చేసిన రూ.11 వేల కోట్లలో ఎల్లంపల్లి ఎగువన ఎంత ఖర్చు చేశారని ఆయన ఈఎన్‌సీని ఈ సందర్భంగా నిలదీశారు. ఈ ప్రాజెక్టులో రూ.50 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందనీ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ మంత్రులను కోరారు.

Spread the love