– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల ఎంపిక, విత్తనాల విత్తే సమయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) పెంటేల రవికుమార్ సూచించారు. ప్రభుత్వం మార్గదర్శకాలు, శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు రైతులు వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వానాకాలంలో సాధారణం కంటే వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. జూలైలో సాధారణ వర్షపాతం కంటే సుమారు 25 శాతం, ఆగస్టులో 10–15 శాతం, సెప్టెంబరులో 42 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో వర్షాధార వ్యవసాయంలో రైతులు నీరు అధికంగా అవసరమయ్యే వరి సాగును వీలైనంత వరకు తగ్గించి, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. పడిన వర్షపు నీటిని వృథా కాకుండా రీఛార్జి గుంతలు, నీటి కుంటలు ఏర్పాటు చేసి సంరక్షించుకోవాలని, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులు అవలంబించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు.
విత్తనాలు నాటే సమయం (సోయింగ్ విండో) అనేది పంట పెరుగుదలకు, వనరుల సమర్థ వినియోగానికి, అధిక దిగుబడికి అనుకూలమైన కాలమని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో, శాస్త్రవేత్తలు సూచించిన గడువుల్లోనే విత్తనాలు వేయాలని రైతులకు సూచించారు.
పంటల వారీగా విత్తే గడువులు:
వరి (స్వల్పకాలిక రకాలు): జూలై 16 – జూలై 31
పత్తి: జూన్ 1 – జూలై 20
కంది: జూన్ 16 – జూలై 15; స్వల్పకాలిక రకాలు జూలై 16 – ఆగస్టు 15
అలసంద: జూలై 1 – జూలై 31
సజ్జ, కొర్ర: జూన్ 1 – జూలై 31
రాగి: జూలై 1 – ఆగస్టు 31
పెసర, మినుము: జూన్ 15 – జూలై 15. అయితే అశ్వారావుపేట మండలంలో రైతుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చని తెలిపారు.
వేరుశనగ: జూన్ 15 – జూలై 31
నువ్వులు: ఆగస్టు 16 – ఆగస్టు 31
సన్‌ఫ్లవర్: ఆగస్టు 1 – ఆగస్టు 15
వర్షపాత పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు పాటించి శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే నష్టాలను తగ్గించుకోవచ్చని ఏడీఏ పెంటేల రవికుమార్ రైతులకు సూచించారు.



