– జూలై 23న కలెక్టరేట్ ముట్టడికి సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న వంట కార్మికులు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ,విద్యార్థుల మెనూ చార్జీలు పెంచకుండా అధికారులు మాత్రం మెనూ చార్ట్ ప్రకారమే భోజనం వండాలని ఒత్తిడి చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విమర్శించారు. ఆదివారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షురాలు నన్ని యామిని అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం కల్పిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకుండా కార్మికులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా, విద్యార్థుల మెనూ చార్జీలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆర్థిక భారాన్ని భరిస్తున్నారని పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23 న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు చేసిన ప్రధాన డిమాండ్లు:
మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి.
విద్యార్థుల మెనూ చార్జీని రూ.25కు పెంచాలి.
గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
కార్మికులకు గుర్తింపు కార్డులు, యూనిఫాం, ప్రమాద బీమా, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలి.
ఈ సమావేశంలో యూనియన్ మండల నాయకులు సీత, పద్మ, రమాదేవి, పుష్ప, దశమి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.



