నేడు సీడబ్ల్యూసీ సమావేశం

CWC meeting today 18 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో…
– ప్రధాని అభ్యర్థిగా రాహూల్‌గాంధీ
– ఇండియా కూటమికి ప్రతిపాదన?
– ఐదు రాష్ట్రాల ఎన్నికలు, జమిలి, పార్టీ బలోపేతంపై చర్చ
– విజయభేరి సభలో ఆరు హామీలు విడుదల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశానికి టీపీసీసీ సర్వం సిద్ధంచేసింది.18 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశానికి భారీ ఏర్పాట్లుచేసింది. 2005లో రాష్ట్రంలో ఏఐసీసీ ప్లీనరీ, సీడబ్య్లూసీ సమావేశం జరిగింది. అంతకు ముందు 1995లో తిరుపతిలో సీడబ్య్లూసీ నిర్వహించారు. ఆ తర్వాత ఇన్నేండ్లకు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నది. శుక్ర, శనివారం రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్‌ సీడబ్య్లూసీ సమావేశానికి వేదిక కానుంది. దేశం నలుమూలల నుంచి 90 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. విస్తృత సమావేశానికి పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇండియా కూటమి బలోపేతం, పెరుగుతున్న మతోన్మాదం, జమిలి ఎన్నికలతోపాటు కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరుపై ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ తీర్మానాన్ని చేసి ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ధృడ సంకల్పంతో ఉన్న కాంగ్రెస్‌ హై కమాండ్‌.. తెలంగాణపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. అందుకు అనుగుణంగా సీడబ్య్లూసీలో కీలక నిర్ణయాలు చేసే అవకాశంఉంది. అగ్ర నాయకత్వం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్న నేపథ్యంలో ఈ సమావేశం రాష్ట్ర ప్రజలతోపాటు జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులు, తదితరులు శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని ఆయా కమిటీల నేతలు, ఇతర ముఖ్య నాయకులు నగరానికి ఇప్పటికే చేరుకున్నారు. సీడబ్య్లూసీ సమావేశం సందర్భంగా తాజ్‌ కృష్ణతోపాటు సభ్యులు బస చేసే హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహి ంచే విజయభేరి సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మరో కీలక నేత జైరాం రమేష్‌…ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్‌ విమానశ్రయం నుంచి తుక్కుగూడ సభాస్థలిని రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. విజయభేరి సభలో సోనియగాంధీ ఆరు హామీలను విడుదల చేయనున్నారు. అందులో కర్నాటక తరహాలో గృహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అసైన్డ్‌ భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించడం, యువత, రైతులకు ప్రత్యేకంగా భరోసా కల్పించనున్నారు. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనార్టీ, బీసీ సామాజిక తరగతులకు డిక్లరేషన్లు సిద్ధం చేసింది. కొన్నింటిని ప్రకటించింది. వీటన్నింటి సమ్మేళనంతో ప్రజలను ఆకర్షించే మ్యానిఫెస్టోను అక్టోబర్‌ మాసంలో విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Spread the love