జూన్‌ 19న డాక్‌ అదాలత్‌

జూన్‌ 19న డాక్‌ అదాలత్‌– 7వ తేదీలోపు ఫిర్యాదుల స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పోస్టల్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్‌ 19వ తేదీ డాక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం, పోస్టల్‌ సర్వీసెస్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎన్‌ రంగారావు తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ అదాలత్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. జూన్‌ 7వ తేదీలోపు తమ లేఖల్ని చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కార్యాలయానికి పంపాలనీ, వాటిపై తప్పనిసరిగా ‘డాక్‌ అదాలత్‌’ అని స్పష్టంగా రాయాలని పేర్కొన్నారు. పోస్టల్‌ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ మేటర్స్‌, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్ని ఈ అదాలత్‌లో స్వీకరించబోమని స్పష్టంచేశారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి అదాలత్‌లు ఉపయోగపడతాయనీ, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. డాక్‌ అదాలత్‌కు రాసే లేఖల్లో ప్రజలు తప్పనిసరిగా తమ ఫోన్‌ నెంబరు, ఈమెయిల్‌ ఐడీ రాయాలనీ, వర్చువల్‌గా జరిగే అదాలత్‌ లింకుల్ని పంపేందుకు ఇవి అత్యవసరమని తెలిపారు. ఈ లింక్‌ల ద్వారా ఫిర్యాదుదారులు నేరుగా అదాలత్‌లో పాల్గొనవచ్చన్నారు. పోస్టల్‌ వినియోగదారులు తమ లేఖల్ని ఎన్‌ రంగారావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ (పీజీ), ఆఫీస్‌ ఆఫ్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ తెలంగాణ సర్కిల్‌, హైదరాబాద్‌-500001 చిరునామాకు పంపాలని కోరారు.

Spread the love