రాష్ట్రంలో అత్యంత మోసపోయింది దళితులే

– కేసీఆర్‌ మోసాలపై ఉద్యమిద్దాం : మునిస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యంత మోసపోయింది దళితులేనని కొల్హార్‌ ఎంపీ, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జి మునిస్వామి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఎస్సీ మోర్చా పదాధికారులు, జిల్లా ఇన్‌చార్జీలు, అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మోస పూరిత హామీలతో దళితులను కేవలం ఓటు బ్యాంకుగా కేసీఆర్‌ చూస్తు న్నారని విమర్శించారు. దళిత సీఎం, మూడెకరాల భూ పంపిణీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు దళిత బంధు పేరుతో కొత్త మోసానికి తెరలేపారని విమర్శించారు. కేసీఆర్‌ మోసాలను ఎండగడుతూ దళితుల పక్షాన పోరాటం చేయాలని ఎస్సీ మోర్చా నాయకులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి యస్‌.కుమార్‌, కార్యవర్గ సభ్యులు వేముల అశోక్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి, నాయకులు కుమ్మరి శంకర్‌, క్రాంతి కిరణ్‌, బి. అంబేద్కర్‌, శ్రీను, అంజిబాబు, చంద్రశేఖర్‌, శివుడు, శివాజీ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love