డల్లాస్‌కాదు.. హైదరాబాద్‌ కల్లాస్‌

– జనం చస్తున్నా కేసీఆర్‌కు పట్టదా? : డీకే
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తానన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..చివరకు దాన్ని కల్లాస్‌గా మార్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వరదలు ముంచెత్తుతున్నా, జనం చస్తున్నా సీఎం కేసీఆర్‌కు పట్టదా? అని ప్రశ్నించారు. భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, జనగామ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయనీ, ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందనీ, 40 వేల కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయని వాపోయారు. జంపన్న వాగులో 8 మంది మతదేహాలు లభ్యమయ్యాయన్నారు. భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదన్నారు. వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే బావ బామ్మర్దులిద్దరూ ఎన్నికల కసరత్తులో బిజీగా ఉన్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్‌ వెంటనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించి బాధిత కుటుంబాలకు భరోసానివ్వాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, సర్వం కోల్పోయిన వారికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. నీట మునిగిన ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన బూర నర్సయ్య గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. హైదరాబాద్‌లో పెద్ద భవంతుల నిర్మాణం జరిగిందంటే అందులో కేసీఆర్‌ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లేనని ఆరోపించారు.

Spread the love