– నూతన నియామకాలకు ముందే బదిలీలు, పదోన్నతులు
– టీఎస్‌యూటీఎఫ్ ప్రతినిధులతో కార్యదర్శి అయేషా మస్రత్ ఖానమ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు, ఇంక్రిమెంట్లు మంజూరు, వేతనాల డ్రాయింగ్ అధికారాలను సంబంధిత ప్రిన్సిపాళ్లకే అప్పగించనున్నట్టు మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అయేషా మస్రత్ ఖానమ్ స్పష్టం చేశారు. టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి నేతృత్వంలో మైనార్టీ గురుకుల ఉపాధ్యాయుల విభాగం ప్రతినిధులు బుధవారం సొసైటీ కార్యదర్శితో సమావేశమయ్యారు. పలు సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హైకోర్టు అనుమతితో నూతన నియామకాలకు ముందుగానే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నామన్నాని వారు తెలిపారు. టీజీటీ హిందీ, ఆర్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రెరియన్లకు పదోన్నతుల చానల్ కల్పించటానికి, సెలవుల్లో పనిచేసిన టీచర్లకు వీక్లీ ఆఫ్ ఇవ్వటానికి అంగీకరించారని పేర్కొన్నారు. సీపీఎస్ బకాయిలను వచ్చే నెలాఖరులోగా సంబంధితుల ఖాతాల్లో సర్దుబాటు చేస్తామనీ, చైల్డ్ కేర్ సెలవుల మంజూరు ఉత్తర్వుల్లో లోపాన్ని సవరిస్తామనీ, అకడమిక్ ప్రణాళికను సవరిస్తామన్నారని తెలిపారు. వినతి పత్రంలో ఇచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షులు జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఎం మహేష్, కోశాధికారి పి నరసింహ, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు కె శైలజ, ఎం జ్యోతి, బి లింగస్వామి, షేక్ జావిద్, భూపేందర్ కౌర్, వి రాజిరెడ్డి, కె నరేష్, జి క్రాంతి కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.