తగ్గుతున్న పీఎం-కిసాన్‌ లబ్దిదారులు

Declining PM-Kisan Beneficiaries– తాజాగా 34 లక్షల మందిని చేర్చిన కేంద్రం
– ఎన్నికల ముంగిట రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పీఎం-కిసాన్‌ లబ్దిదారుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. గత సంవత్సరం ఏప్రిల్‌-జూలై మధ్యకాలంలో లబ్దిదారుల సంఖ్య 10.47 కోట్లు ఉండగా ఇప్పుడది 8.12 కోట్లు మాత్రమే ఉంది. అంటే లబ్దిదారుల సంఖ్య 20% తగ్గిందన్న మాట. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడి తక్షణ చర్యలకు ఉపక్రమించింది. మోడీ ప్రభుత్వం గత నెల 15వ తేదీన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి పీఎం-కిసాన్‌లో కొత్తగా 34 లక్షల మంది రైతులను లబ్దిదారులుగా చేర్చింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులను లబ్దిదారులుగా చేర్చి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉందనగా మోడీ ప్రభుత్వం ఈ యాత్రను ప్రారంభించింది. ఇది జనవరి 26వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలలో గరిష్ట సంఖ్యలో లబ్దిదారులను చేర్చడం ఈ యాత్ర ముఖ్యోద్దేశం. చివరిసారిగా గత నెల 15న పీఎం-కిసాన్‌ లబ్దిదారులకు ప్రభుత్వం చెల్లింపులు జరిపింది. దేశంలోని 8.12 కోట్ల మంది రైతులు రెండు వేల రూపాయల చొప్పున అందుకున్నారు. కొత్తగా లబ్దిదారులుగా చేర్చిన 34 లక్షల మంది రైతులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా తదుపరి వాయిదా మొత్తం… అంటే రెండు వేల రూపాయలు చెల్లిస్తారు.
తగ్గుతూనే ఉంది
ఆగస్ట్‌-నవంబర్‌ మధ్య కాలంలో పథకం లబ్దిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోవడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. గత ఏడాది ఏప్రిల్‌-జూలై మధ్యకాలంలో గరిష్టంగా 10.47 కోట్లు ఉన్న లబ్దిదారుల సంఖ్య ఆగస్ట్‌-నవంబర్‌ నాటికి 8.57 కోట్లకు, 2022 డిసెంబర్‌-2023 మార్చి నాటికి 8.12 కోట్లకు తగ్గిపోయిందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవల లోక్‌సభకు తెలియజేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూలై మధ్యకాలంలో లబ్దిదారుల సంఖ్య స్వల్పంగా పెరిగి 8.57 కోట్లకు చేరినప్పటికీ మళ్లీ తగ్గిపోయిందని చెప్పారు.
యూపీ రైతులే ఎక్కువ
పీఎం-కిసాన్‌లో కొత్తగా చేరిన లబ్దిదారుల్లో అత్యధికంగా 8.50 లక్షల మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. రాజస్థాన్‌కు చెందిన 2.39 లక్షలు, మణిపూర్‌కు చెందిన 2.27 లక్షలు, జార్ఖండ్‌కు చెందిన 2.2 లక్షలు, మహారాష్ట్రకు చెందిన 1.89 లక్షల మంది రైతులు ఈ పథకంలో కొత్తగా చేరారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ముగిసే లోగా లబ్దిదారుల సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
చెల్లింపులూ తగ్గాయి
లబ్దిదారుల సంఖ్య తగ్గడంతో రైతులకు చెల్లింపులు కూడా తగ్గాయి. 2021-22లో అత్యధికంగా రూ.67,121 కోట్ల మేర చెల్లింపులు జరగగా గత సంవత్సరంలో రూ.58,258 కోట్లకు తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్‌ 22వ తేదీ వరకూ రూ.38,660 కోట్లను ప్రభుత్వం రైతులకు చెల్లించింది. రైతులు తమ ఆధార్‌ నెంబర్లను బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానం చేయాలని నిబంధన విధించడం వల్లనే లబ్దిదారుల సంఖ్య తగ్గిందని తోమర్‌ చెబుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ ఏడాది ఫిబ్రవరి 24న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి మూడు విడతలలో మొత్తం ఆరు వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలలో జమ చేస్తారు.

Spread the love