పర్యవేక్షణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి

Adilabadనవతెలంగాణ-కాగజ్‌నగర్‌
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలని పీఆర్‌టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షులు ఎటుకూరి శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సంఘం మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట కార్యక్రమాలు నిర్వహించే మహిళలకు నెలల తరబడి బిల్లులు రావడం లేదని, దీనితో భోజన నిర్వహణ కష్టసాధ్యంగా మారుతోందని అన్నారు. వీటిపై పాఠశాల ఉపాధ్యాయులను పర్యవేక్షణకు నియమించడంతో వారు అటు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై దృష్టి సారించలేక, ఇటు బోధనపై దృష్టి సారించలేక సతమతమవుతున్నారని అన్నారు. కాబట్టి దీని పర్యవేక్షణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని, పీఆర్‌సీ నివేదికను, నిర్వహణ గ్రాంట్‌ను విడుదల చేయాలని, పాఠశాలల్లో పని చేసే పారిశుద్ద్య కార్మికులకు వేతనాలు, సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆగష్టు నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కాగజ్‌నగర్‌ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎనగంటి భిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా పత్తిపాక శ్రావణ్‌, అసోషియేట్‌ అధ్యక్షులుగా పి రామన్న, ఉపాధ్యక్షులుగా జర్పుల లాలాజీ, మహిళా ఉపాధ్యక్షురాలిగా లింగంపల్లి స్వర్ణలత, కార్యదర్శిగా గంజి చంద్రశేఖర్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూటీఎస్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love