పిల్లలకు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందులోనూ క్యాండీలనైతే మరీ ఇష్టపడతారు. ఎన్ని ఇచ్చినా కాదనకుండా తినేస్తారు. వాటి కోసం మారాం చేస్తారు కూడా! అయితే బయట కొనేవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక వారికి ఇష్టమైన క్యాండీలను ఇంట్లోనే తయారు చేసి ఇస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాంటి రుచికరమైన రకరకరాల క్యాండీలను ఎలా తయారుచేయాలో ఈరోజు తెలుసుకుందాం…
రోజ్ క్యాండీ
కావల్సిన పదార్థాలు: గులాబీ రేకలు – యాభై గ్రాములు, పంచదార – అర కిలో, నిమ్మరసం – టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర స్పూన్, ఫుడ్ కలర్ – రెండు చుక్కలు, నెయ్యి – స్పూన్
తయారీ విధానం: గులాబీ రేకలను కడిగి వస్త్రం మీద పరిచి ఆరబెట్టాలి. సేంద్రియ గులాబీలను ఎంచుకుంటే మంచిది. వాటిని జార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. మందపాటి పాత్రలో 150 ఎం.ఎల్ నీళ్లు, గ్రైండ్ చేసిన గులాబీ రేకలు, పంచదార వేసి సన్న మంట మీద ఉడికించాలి. తీగ పాకం వచ్చాక.. నిమ్మరసం, రోజ్ వాటర్, యాలకుల పొడి, ఫుడ్ కలర్ కలపాలి. ఆరేడు నిమిషాలు కలియబెడుతూ ఉడికించాలి. చిక్కబడిన తర్వాత దించేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లో సమంగా సర్దాలి. చల్లారిన తర్వాత చతురస్రం లేదా నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నీడలో ఒక రోజంతా ఆరబెడితే.. మరింత గట్టిపడతాయి. తర్వాత గాలి చొరబడని సీసాలోకి తీసి రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకోవాలి. ఈ క్యాండీలు మూడు నెలల వరకు నిలవుంటాయి.
మిల్క్ క్యాండీ..
కావల్సిన పదార్థాలు: కండెన్స్‌డ్ మిల్క్ – అర లీటర్, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, మిల్క్ పౌడర్ – రెండు కప్పులు, యాలకుల పొడి – అర స్పూన్, బాదం, జీడిపప్పులు – నాలుగు టేబుల్ స్పూన్లు, పంచదార పొడి, ఎండు కొబ్బరి పొడి – స్పూన్ చొప్పున
తయారీ విధానం: బాదం, జీడిపప్పులను వేయించి పలుకులుగా చేయాలి. అడుగుభాగం మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో కండెన్స్‌డ్ మిల్క్ జతచేసి సన్న మంటపై మరిగించాలి. పాలు తెర్లుతున్నప్పుడు.. మిల్క్ పౌడర్ కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. మిశ్రమం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. రెండు నిమిషాల తర్వాత.. యాలకుల పొడి, నెయ్యి జోడించాలి. మిశ్రమం పాత్రకు అతుక్కోకుండా విడిపోతున్నప్పుడు బాదం, జీడిపప్పులు వేసి.. దించేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటి మీద ఎండు కొబ్బరి, పంచదార పొడులు చల్లితే ఒకదానికొకటి అంటుకోవు. అంటే సాఫ్ట్ అండ్ స్వీట్ క్యాండీలు రెడీ.
అల్లం క్యాండీ
కావల్సిన పదార్థాలు: అల్లం – పావు కిలో, నిమ్మరసం – అర కప్పు, పంచదార పొడి – స్పూన్, పంచదార – కప్పు, బెల్లం పొడి – వంద గ్రాములు, ఉప్పు – చిటికెడు, మిరియాల పొడి – అర స్పూన్, యాలకుల పొడి – పావు స్పూన్, నెయ్యి – రెండు స్పూన్లు
తయారీ విధానం: అల్లం తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కోసి గ్రైండ్ చేయాలి. మరీ పేస్ట్‌లా చేయకూడదు. ప్యాన్‌లో ఒకటిన్నర స్పూన్ల నెయ్యి వేడిచేసి అల్లం ముద్దను రెండు మూడు నిమిషాలు వేయించాలి. అందులో పంచదార, బెల్లం పొడి, నిమ్మరసం వేసి.. సన్న సెగ మీద కలియబెడుతూనే ఉండాలి. దగ్గరగా అయ్యాక.. ఉప్పు, మిరియాల పొడి, యాలకుల పొడి జోడించాలి. మిశ్రమం ప్యాన్‌కు అంటుకోకుండా విడిపోతున్నప్పుడు సెగ తీసేయాలి. చల్లారాక.. నెయ్యి రాసిన ప్లేట్‌లో సమంగా సర్దాలి. వేడిగా ఉన్నప్పుడే నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కట్ చేయాలి. చల్లారాక ముక్కలను విడదీసి పంచదార పొడి చల్లాలి. ఇలా చేస్తే ఒకదానికొకటి అంటుకోవు. వీటిని గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకోవాలి. ఈ క్యాండీలు నోటికి రుచిగా ఉండటమే కాదు.. జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గొంతునొప్పి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆరెంజ్ క్యాండీ
కావల్సిన పదార్థాలు: నారింజ తొనలు, పంచదార – కప్పు చొప్పున, పంచదార పొడి – స్పూన్, నిమ్మరసం – టేబుల్ స్పూన్, నచ్చిన రంగు ఫుడ్ కలర్ – కొద్దిగా, నెయ్యి – అర స్పూన్
తయారీ విధానం: నారింజ తొనల్లో గింజలు తీసేయాలి. వాటిల్లో కొన్ని వేడి నీళ్లు పోసి.. రెండు మూడు నిమిషాలు మరిగించి, ఆ నీటిని వడకట్టాలి. తొనలు చల్లారాక గ్రైండ్ చేయాలి. పంచదారలో కప్పు నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకూ వేడిచేయాలి. అందులో నారింజ గుజ్జు, ఫుడ్ కలర్ వేసి కలియబెడుతూ సన్న సెగ మీద ఉడికించాలి. పావు గంట తర్వాత దించేసి నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. వాటి మీద పంచదార పొడి చల్లితే క్యాండీలు ఒకదానికొకటి అంటుకోవు. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని సీసాలోకి తీసి.. రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకోవాలి. మరింత తీపి కావాలంటే పంచదార ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.



