చెన్నై, బెంగళూరుల్లో దట్టమైన పొగ మంచు

చెన్నై, బెంగళూరుల్లో దట్టమైన పొగ మంచు– అనేక విమానాలు రద్దు, దారి మళ్లింపు
న్యూఢిల్లీ : చెన్నై, బెంగళూరు నగరాలను ఆదివారం ఉదయం నుంచి దట్టమైన పొగ మంచు కమ్మేసింది. దీంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా విమానయానానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ రెండు విమానాశ్రయాల నుంచి అనేక విమానాలను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. చెన్నై విమానశ్రయం నుంచి 14 విమాన సర్వీసులను రద్దు చేశామని, ఐదు విమానాలను దారి మళ్లించామని, మరో 17 విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 4:30 గంటల నుంచి 7:50 గంటల వరకూ పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకున్నాయని, దృశ్యమానత 100 మీటర్ల లోపునకు దిగజారిందని అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా అనేక విమానాలు రద్దు చేయడం లేదా దారి మళ్లించడం చేశారు. ఢిల్లీకి వెళ్లవలసిన ఏడు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నైకు వెళ్లవలసిన ఒక విమానాన్ని హైదరాబాద్‌కు దారి మళ్లించారు. పొగమంచు కారణంగా ఆదివారం 44 విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు.

Spread the love