వారంలో రూ.80వేల కోట్ల డిపాజిట్లు

– బ్యాంక్‌ల్లో రూ.2వేల నోట్ల జమ
న్యూఢిల్లీ : రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించిన వారం రోజుల్లోనే రూ.80,000 కోట్ల విలువ చేసే ఈ పెద్ద నోట్లు బ్యాంక్‌ల్లో జమ అయ్యాయి. ఈ కరెన్సీ మార్పిడికి నాలుగు నెలలు సమయం ఉండటంతో రూ.3.6 లక్షల కోట్ల మొత్తం కూడా తిరిగి బ్యాంక్‌లకు రావొచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్‌బీఐ గణంకాల ప్రకారం.. రూ.2వేల నోట్ల డిపాజిట్లతో మే 26 నాటికి దేశంలోని మొత్తం నగదు చెలామణి రూ.34.41 లక్షల కోట్లకు తగ్గింది. వచ్చే కొన్ని వారాల్లో మరింత తగ్గొచ్చని అంచనా. తమ వద్ద రూ.14,000 కోట్ల డిపాజిట్లు, రూ.3,000 కోట్ల విలువ చేసే రూ.2వేల నోట్ల మార్పిడి జరిగిందని ఎస్‌బీఐ చైర్మెన్‌ దినేష్‌ ఖారా ఇటీవల తెలిపారు. పెద్ద నోట్లు మొత్తం తమ వద్ద రూ.80వేల కోట్ల మేర డిపాజిటు అయ్యే అవకాశం ఉందని ఆ బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం కరెన్సీలో 10-15 శాతం వరకు రూ.2వేల నోట్లు వాటా కలిగి ఉన్నాయి.

Spread the love