సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని

MS Dhoni– గాయంతో సీజన్‌కు రుతురాజ్‌ దూరం
– సిఎస్‌కె చీఫ్‌ కోచ్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌
చెన్నై: దిగ్గజ క్రికెటర్‌, కెప్టెన్‌ కూల్‌ ఎం.ఎస్‌ ధోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరోసారి సారథ్య పగ్గాలు చేపట్టనున్నాడు. ఐపీఎల్‌18లో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఎం.ఎస్‌ ధోని తీసుకోనున్నట్టు ఆ జట్టు చీఫ్‌ కోచ్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌ గురువారం వెల్లడించారు. సూపర్‌కింగ్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌, ఫామ్‌లో ఉన్న కీలక బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయంతో సీజన్‌కు దూరం అయ్యాడు.
‘రుతురాజ్‌ గైక్వాడ్‌ సీజన్‌కు దూరమయ్యాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో గువహటిలో రుతురాజ్‌ గాయానికి గురయ్యాడు. నొప్పితో బాధపడుతున్న రుతురాజ్‌కు ఎల్బోలో ఎయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌ అయ్యిందని ఎంఆర్‌ఐ స్కాన్‌లో తేలింది’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు. చెపాక్‌ వేదికగా నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఫ్లెమింగ్‌.. జట్టులోని అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడిని కొత్త కెప్టెన్‌గా ప్రకటించాడు. ‘మా జట్టులో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ ఎం.ఎస్‌ ధోని ఉన్నాడు. ఐపీఎల్‌18లో మిగిలిన మ్యాచులకు అతడు సారథ్యం వహిస్తాడు. ప్రస్తుత పరిస్థితిని ధోని అర్థం చేసుకున్నాడు. సారథ్య పగ్గాలు అందుకునేందుకు ఏమాత్రం వెనుకాడలేదు’ అని ఫ్లెమింగ్‌ అన్నాడు. సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నాలుగింట పరాజయం పాలైంది.

Spread the love