Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంఅదానీ నిర్ణయం న్యాయ శాఖను ప్రభావితం చేసిందా?

అదానీ నిర్ణయం న్యాయ శాఖను ప్రభావితం చేసిందా?

- Advertisement -

ట్రంప్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డెమొక్రాట్‌ సెనెటర్లు
న్యూఢిల్లీ :
అమెరికాలో పది బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ముందుకు రావడం న్యాయశాఖను ప్రభావితం చేసిందా అని ఇద్దరు డెమొక్రటిక్‌ పార్టీ సీనియర్‌ సెనెటర్లు ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గౌతమ్‌ అదానీపై విచారణ జరపాలన్న నిర్ణయాన్ని అమెరికా న్యాయశాఖ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని అమెరికా ఫెడరల్‌ కోర్టు ఆ శాఖను ఆదేశించింది. ఇది జరగడానికి రెండు వారాల ముందే డెమొక్రాట్‌ సెనెటర్లు తమ సందేహాన్ని లేవనెత్తారు. కేసును ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో సవివరంగా తెలియజేయాలని న్యాయశాఖను వారు కోరారు. ఈ మేరకు సెనెటర్లు ఎలిజబెత్‌ వారెన్‌, రిచర్డ్‌ బ్లూమెంతల్‌ ఈ నెల 11న తాత్కాలిక అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లెంచ్‌కి ఓ లేఖ రాశారు. గౌతమ్‌ అదానీపై మోపిన అభియోగాలను కొట్టివేయాలని న్యాయ శాఖ కోరడాన్ని చూస్తుంటే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో జరిగిన అవినీతిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, న్యాయశాఖ నిర్ణయంలో అదానీ ప్రమేయంపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని వారు లేఖలో తెలిపారు.

అదానీ సహా ఎనిమిది మందిపై మోపిన అభియోగ పత్రాన్ని కొట్టివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తక్షణమే ఆమోదించేందుకు అమెరికా జిల్లా జడ్జి నికొలస్‌ గరాఫిస్‌ శుక్రవారం నిరాకరించడంతో ఈ లేఖకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అభియోగాలను ఎందుకు కొట్టివేయాలో వచ్చే నెల 13వ తేదీ లోగా వివరించాలని, అందుకు తగిన ఆధారాలను అందించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. గౌతమ్‌ అదానీపై ఉన్న క్రిమినల్‌ కేసును కొట్టివేస్తే అమెరికాలో పది బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకు వచ్చిందని ట్రంప్‌ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది రాబర్ట్‌ గిఫ్రా జూనియర్‌ ఏప్రిల్‌లో న్యాయ శాఖ అధికారులకు చెప్పారంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని సెనెటర్లు ఈ ప్రశ్నలు లేవనెత్తారు.

అమెరికాలో పెట్టుబడులకు సంబంధించి అదానీ లేదా ఆయన ప్రతినిధులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతిపాదన చేశారా అని నిలదీశారు. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే ఎప్పుడు చేశారు, హాజరైన న్యాయ శాఖ అధికారులు ఎవరు, ప్రతిపాదనలో వాడిన పదజాలం ఏమిటి, ఏవైనా షరతులు ఉన్నాయా వంటి వివరాలన్నీ బయటపెట్టాలని వారు డిమాండ్‌ చేశారు. అభియోగాల ఉపసంహరణకు ముందు అదానీ గ్రూప్‌ అమెరికాలో ఎందుకు పెట్టుబడులు పెట్టలేకపోయిందో కూడా తెలియజేయాలని సెనేటర్లు పట్టుపట్టారు. అభియోగాల ఉపసంహరణకు దారితీసిన కారణాలపై లోతైన పరిశీలన అవసరమని సెనెటర్లు అభిప్రాయపడ్డారు. న్యాయ శాఖ నిర్ణయం అదానీ గ్రూపుకు అదనపు వ్యాపార అవకాశాలు కల్పించిందని తెలిపారు. లంచం ఇచ్చి లాభాలు దండుకోవచ్చునన్న అపోహకు ఈ నిర్ణయం మరింత పెంచే పోషించే ప్రమాదం ఉన్నదని సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ శాఖ నిర్ణయం తర్వాత అదానీ గ్రూప్‌ వాటాల ధరలు పెరిగాయని సెనెటర్లు గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -